టాప్ 4 టీమ్స్‌ నాకౌట్‌‌ అవకాశాలను గండికొడుతున్న ముంబై, లక్నో, కోల్కతా.. GTపై గెలుపుతో ఇప్పటికీ ప్లే ఆఫ్ రేసులోనే KKR

టాప్ 4 టీమ్స్‌ నాకౌట్‌‌ అవకాశాలను గండికొడుతున్న ముంబై, లక్నో, కోల్కతా.. GTపై గెలుపుతో ఇప్పటికీ ప్లే ఆఫ్ రేసులోనే KKR
  • 29 రన్స్‌‌ తేడాతో గుజరాత్‌‌పై కోల్‌‌కతా విజయం
  • చెలరేగిన రఘువంశీ, గ్రీన్‌‌
  • గిల్‌‌, బట్లర్‌‌, సుదర్శన్‌‌ పోరాటం వృథా

కోల్‌‌కతా: మొదట ముంబై.. తర్వాత లక్నో.. ఇప్పుడు కోల్‌‌కతా.. ఐపీఎల్‌‌–19 చివరి దశలో దుమ్మురేపుతున్నాయి. ఇతర టీమ్స్‌‌ నాకౌట్‌‌ అవకాశాలను గండికొడుతూ అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా ఫిన్‌‌ అలెన్‌‌ (35 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 10 సిక్స్‌‌లతో 93), అంగ్‌‌క్రిష్‌‌ రఘువంశీ (44 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 7 సిక్స్‌‌లతో 82 నాటౌట్‌‌), కామెరూన్‌‌ గ్రీన్‌‌ (28 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌‌లతో 52 నాటౌట్‌‌) దంచికొట్టడంతో.. శనివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో కోల్‌‌కతా 29 రన్స్‌‌ తేడాతో గుజరాత్‌‌పై గెలిచింది. 

దాంతో జీటీ వరుస ఐదు విజయాలకు చెక్​ పడగా.. కేకేఆర్‌‌ ప్లే ఆఫ్స్​ రేసులోనే ఉంది. టాస్‌‌ ఓడిన కోల్‌‌కతా 20 ఓవర్లలో 247/2 స్కోరు చేసింది. ఈ సీజన్‌‌లో కేకేఆర్‌‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. తర్వాత గుజరాత్‌‌ 20 ఓవర్లలో 218/4 స్కోరు చేసింది. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (49 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 7 సిక్స్‌‌లతో 85), సాయి సుదర్శన్‌‌ (52 నాటౌట్‌‌), బట్లర్‌‌ (57) చెలరేగినా ప్రయోజనం దక్కలేదు. నరైన్‌‌కు  ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

  • క్యాచ్‌‌లు డ్రాప్‌‌లు..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన కోల్‌‌కతాకు అలెన్‌‌ మెరుపు ఆరంభాన్నిస్తే.. గుజరాత్‌‌ ఫీల్డర్లు అతను ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌‌లు వదిలేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు. 14, 33 రన్స్‌‌ వద్ద కవర్స్‌‌లో హోల్డర్‌‌, లాంగాన్‌‌లో సిరాజ్‌‌ క్యాచ్‌‌లు డ్రాప్‌‌ చేశారు. స్టార్టింగ్‌‌లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌‌లతో దూకుడు మొదలుపెట్టిన అలెన్‌‌.. మధ్యలో జీటీ బౌలింగ్‌‌ను ఊచకోత కోశాడు. రెండో ఎండ్‌‌లో సిక్స్‌‌తో టచ్‌‌లోకి వచ్చిన రహానే (14) ఐదో ఓవర్‌‌లో వెనుదిరగడంతో తొలి వికెట్‌‌కు 44 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 

వన్‌‌డౌన్‌‌లో రఘువంశీ కూడా చేయి వేయడంతో పవర్‌‌ప్లేలో కోల్‌‌కతా 56/1 స్కోరు చేసింది. 7వ ఓవర్‌‌లో రఘుంశీ సిక్స్‌‌ బాదితే.. తర్వాతి ఓవర్‌‌లో అలెన్‌‌ రెండు సిక్స్‌‌లు, ఓ ఫోర్‌‌తో 21 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. 9వ ఓవర్‌‌లో మరో రెండు సిక్స్‌‌లతో రెచ్చిపోయాడు. 10వ ఓవర్‌‌లో చెరో సిక్స్‌‌ బాదడంతో స్కోరు 116/1కు పెరిగింది. 11వ ఓవర్‌‌లో అలెన్‌‌ 6, 6, 6, 4తో 22 రన్స్‌‌ దంచాడు. సెంచరీ దిశగా సాగుతున్న అలెన్‌‌ను 12వ ఓవర్‌‌లో సాయి కిశోర్‌‌ (1/38) ఔట్‌‌ చేశాడు. 

ఫలితంగా రెండో వికెట్‌‌కు 95 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. అలెన్‌‌ ఔటైన తర్వాత రఘువంశీ, గ్రీన్‌‌ దూకుడును మరో మెట్టు ఎక్కించారు. 13వ ఓవర్‌‌లో రఘువంశీ ఫోర్‌‌, సిక్స్‌‌ బాదితే, 14వ ఓవర్‌‌లో గ్రీన్‌‌ 6, 4, 6తో 17 రన్స్‌‌ రాబట్టాడు. దాంతో 15 ఓవర్లలో స్కోరు 179/2కు చేరింది. 16వ ఓవర్‌‌లో గ్రీన్‌‌ 4, 6, తర్వాతి ఓవర్‌‌లో రఘువంశీ ఫోర్‌‌తో 33 బాల్స్‌‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. తర్వాత సింగిల్స్‌‌తో స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేసినా.. 19వ ఓవర్‌‌లో రఘువంశీ 6, 6, 6, 4తో 25 రన్స్‌‌ దంచాడు. ఆ వెంటనే గ్రీన్‌‌ 26 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ సాధించాడు. చివరి ఐదు ఓవర్లలో 68 రన్స్‌‌ రావడంతో కోల్‌‌కతా భారీ టార్గెట్‌‌ను నిర్దేశించింది. 

  • గిల్‌‌ దంచినా..

భారీ ఛేదనలో గుజరాత్‌‌ ఆరంభం నుంచే దుమ్మురేపింది. రెండు ఫోర్లతో తొలి ఓవర్‌‌ను మొదలుపెట్టిన సుదర్శన్‌‌ ఆ తర్వాత 4, 6, 4 కొట్టి రిటైర్డ్‌‌ హర్ట్‌‌ అయ్యాడు. మధ్యలో గిల్‌‌ 4, 6తో టచ్‌‌లోకి వచ్చాడు. కానీ ఐదో ఓవర్‌‌లో నిశాంత్‌‌ సింధు (1) ఔటయ్యాడు. బట్లర్‌‌ నెమ్మదిగా ఆడటంతో పవర్‌‌ప్లేలో జీటీ 56/1 స్కోరు చేసింది. 7వ ఓవర్‌‌లో రెండు సిక్స్‌‌లతో గిల్‌‌ జోరు పెంచాడు. 9వ ఓవర్‌‌లో దాన్ని రిపీట్‌‌ చేశాడు. బట్లర్‌‌ రెండు ఫోర్లు రాబట్టడంతో తొలి 10 ఓవర్లలో గుజరాత్‌‌ స్కోరు 101/1కు చేరింది. 

ఈ క్రమంలో గిల్‌‌ 33 బాల్స్‌‌లో హాఫ్‌‌ సెంచరీ చేశాడు. ఇక్కడి నుంచి బట్లర్‌‌ ఫోర్లతో రెచ్చిపోయాడు. 14వ ఓవర్‌‌లో గిల్‌‌ 6, 4, 6, 4తో 22 రన్స్‌‌ రాబట్టాడు. దాంతో ఐదు ఓవర్లలో 63 రన్స్‌‌ రావడంతో జీటీ స్కోరు 163/1కు పెరిగింది. ఇక చివరి ఐదు ఓవర్లలో 85 రన్స్‌‌ కావాల్సిన దశలో 4, 6 కొట్టినా.. నరైన్‌‌ (2/29) బౌలింగ్‌‌లో  గిల్‌‌ క్యాచ్‌‌ ఔటయ్యాడు. రెండో వికెట్‌‌కు 128 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. మళ్లీ తిరిగి వచ్చిన సుదర్శన్‌‌ 6, 4, 4.. బట్లర్‌‌ 6 కొట్టి వెనుదిరగడంతో జీటీ ఓటమి ఖాయమైంది. 

సంక్షిప్త స్కోర్లు

కోల్‌‌కతా: 20 ఓవర్లలో 247/2 (అలెన్‌‌ 93, రఘువంశీ 82*, గ్రీన్‌‌ 52*, సాయి కిశోర్‌‌ 1/38). 

గుజరాత్‌‌: 20 ఓవర్లలో 218/4 (గిల్ 85, బట్లర్‌‌ 57, సుదర్శన్‌‌ 52*, నరైన్‌‌ 2/29).