న్యూఢిల్లీ: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంఛైజీ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఆదేశాల మేరకు బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఈ మేరకు శనివారం (జనవరి 3) కేకేఆర్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌కు ముందు బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ ఆదేశించింది. బీసీసీఐ ఆదేశం మేరకు అతడిని స్వ్కాడ్ నుంచి రిలీజ్ చేశాం. ఐపీఎల్ నిబంధనలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకుంటాం’’ అని కేకేఆర్ ప్రకటనలో పేర్కొంది. ముస్తాఫిజుర్ స్థానంలో రిచర్డ్ గ్లీసన్, ఫజల్హాక్ ఫారూఖీ, స్పెన్సర్ జాన్సన్ ఈ ముగ్గురిలో ఒకరిని జట్టులోకి తీసుకోవాలని భావిస్తోన్నట్లు సమాచారం.
అసలు ఏం జరిగిందంటే..?
కోల్కత్తా నైట్రైడర్స్ టీం నుంచి బంగ్లాదేశ్ స్టార్ ముస్తఫిజుర్ రెహ్మాన్ను రిలీజ్ చేయాలని కేకేఆర్ యాజమాన్యాన్ని బీసీసీఐ ఆదేశించింది. ఇటీవల భారత పొరుగు దేశంలో బంగ్లాదేశ్లో హిందువులపై అఘాయిత్యాలు పెరిగిపోవడంతో ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్ క్రికెటర్కు ఐపీఎల్లో ఆడేందుకు అనుమతి ఇవ్వడం సమంజసం కాదని భావించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read : నీ అవసరం జట్టుకు లేదు.. తప్పించడానికి కారణం లేకున్నా సీనియర్‌పై వేటు
ముస్తాఫిజుర్ రెహ్మాన్ను వదిలేసుకున్న క్రమంలో రీప్లేస్‌మెంట్‌కు కేకేఆర్‌కు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. 2026 ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో ఆక్షన్‌లో నిలిచిన ముస్తఫిజుర్ను 9.20 కోట్లకు కేకేఆర్ జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మంచి ఫామ్‌లో ఉండటంతో ముస్తాఫిజుర్ కోసం చెన్నై, ఢిల్లీ జట్లుతో పోటీ పడి మరీ కేకేఆర్ దక్కించుకుంది. తద్వారా ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన బంగ్లా ప్లేయర్ గా ముస్తాఫిజుర్ నిలిచాడు. కానీ ఇరుదేశాల మధ్య చోటు చేసుకున్న పరిస్థితుల వల్ల అతడికి 2026 సీజన్ ఐపీఎల్ ఆడే అవకాశం లేకుండా పోయింది.
