
రాజస్తాన్‌ను చిత్తు చేసిన నైట్ రైడర్స్
రాణించిన గిల్, మోర్గాన్
చెలరేగిన మావి, నాగర్కోటి, చక్రవర్తి
ఫస్ట్ మ్యాచ్‌లో టాప్ టీమ్ చెన్నైని ఓడించి ఖాతా తెరిస్తే మలిపోరులో పంజాబ్‌పై రికార్డు టార్గెట్‌ను ఛేజ్ చేసి ఔరా అనిపించింది రాజస్తాన్ రాయల్స్. ఇప్పుడు కోల్‌కతాతో పోరు అనగానే ఆ జట్టు హ్యాట్రిక్ విక్టరీ కొట్టడం ఖాయం అనుకున్నారంతా! కానీ, ఈ సారి ఆ జట్టు ఆట సాగలేదు. లాస్ట్ మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించి విజయాల బాట పట్టిన నైట్ రైడర్స్ కమాల్ చేసింది. బ్యాట్‌తో రాణించి, బంతితో చెలరేగి రాజస్తాన్‌కు ఓటమి మిగిల్చింది. ఫస్ట్ రెండు మ్యాచ్‌ల్లో ఈజీగా 200 ప్లస్ రన్స్ చేసిన రాయల్స్ కేకేఆర్ బౌలర్ల దాటికి నార్మల్ టార్గెట్ కూడా ఛేజ్ చేయలేకపోయింది. చెన్నై, పంజాబ్‌పై దంచికొట్టిన బ్యాట్స్‌మెన్ ఈసారి బ్యాట్లెత్తేశారు..! అండర్19 వరల్డ్ కప్ స్టార్స్ కమలేశ్ నాగర్కోటి (2/13), శివమ్ మావి (2/20), స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (2/25) కోల్‌కతాకు భారీ విజయం కట్టబెట్టారు.
దుబాయ్: కోల్‌కతా నైట్ రైడర్స్ కమాల్ చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలో మెప్పించి టేబుల్ టాపర్‌గా ఉన్న రాజస్తాన్ రాయల్స్‌కు చెక్ పెట్టి సీజన్‌లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన వన్‌సైడ్ మ్యాచ్‌లో కేకేఆర్37 పరుగుల తేడాతో రాయల్స్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 రన్స్ చేసింది. ఓపెనర్శుభ్మన్ గిల్ (34 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 47) సత్తా చాటగా, ఇయాన్ మోర్గాన్ (23 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 34 నాటౌట్), ఆండ్రీ రసెల్ (14 బంతుల్లో 3 సిక్సర్లతో 24) మెరుపులు మెరిపించారు. అనంతరం కేకేఆర్బౌలింగ్ దెబ్బకు రాజస్తాన్ ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు 137 పరుగులే చేసి ఓడిపోయింది. ఏడో నంబర్లో వచ్చిన కరన్ (36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 నాటౌట్) టాప్ స్కోరర్. బట్లర్ (16 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 21) మినహా టాప్-–5లో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. మావికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
గిల్, మోర్గాన్ మెరుపుల్
ఫామ్‌లో ఉన్న గిల్ స్టార్టింగ్ నుంచే మంచి షాట్లతో అలరించినా..మరో ఓపెనర్ సునీల్ నరైన్ (15) తడబడ్డాడు. ఫస్ట్ ఓవర్లో ఆర్చర్ (2/18) ఒకే పరుగివ్వగా.. రాజ్‌పుత్ (1/39) వేసిన సెకండ్ ఓవర్లో లాఫ్టెడ్ షాట్‌తో లాంగాన్ మీదుగా సిక్సర్కొట్టాడు. కానీ, నరైన్ ఏడో బాల్‌కు గానీ ఖాతా తెరవలేకపోయాడు. ఆ బాల్‌కు కూడా అతనిచ్చిన క్యాచ్‌ను ఊతప్ప మిస్ చేయడంతో లైఫ్ వచ్చింది. మరోవైపు రాజ్‌పుత్‌ను టార్గెట్ చేసిన గిల్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు రాబట్టాడు. బ్యాట్ మార్చిన నరైన్.. ఉనాద్కట్ (1/14) బౌలింగ్‌లో వరుసగా 6, 4తో జోరందుకునే ప్రయత్నం చేశాడు. కానీ, నెక్ట్స్ బాల్‌కే క్లీన్ బౌల్డ్ అవడంతో ఫస్ట్ వికెట్‌కు 36 రన్స్పార్ట్నర్షిప్ ముగిసింది. ఆపై, టామ్ కరన్ బౌలింగ్‌లో నితీశ్ రాణా (17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 22) బౌండ్రీతో ఖాతా తెరవగా.. పవర్‌ప్లేలో కోల్‌కతా 42/1తో నిలిచింది. ఆ తర్వాత కెప్టెన్ స్మిత్ రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లు శ్రేయస్ గోపాల్ (0/43), రియాన్ పరాగ్ (0/14)లను దింపాడు. గిల్.. గోపాల్ ఓవర్లో బౌండ్రీ కొట్టి స్కోరు యాభై దాటించగా, పరాగ్‌కు రాణా సిక్సర్‌తో వెల్‌కమ్ చెప్పాడు.
పదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన తెవాటియా ఫుల్, ఫ్లాట్ బాల్‌తో రాణాను ఔట్ చేయడంతో సెకండ్ వికెట్‌కు 46 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఈ దశలో కేకేఆర్ హార్డ్ హిట్టర్ రసెల్ నాలుగో నంబర్లో బ్యాటింగ్‌కు రావడంతో రాయల్స్ కెప్టెన్ స్మిత్.. ఆర్చర్‌ను మళ్లీ బౌలింగ్‌కు దింపాడు. ఫస్ట్ బాల్‌కే గిల్‌ను ఔట్ చేసిన ఆర్చర్ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బాల్‌ను గిల్ లెగ్ గ్లాన్స్ ఆడగా.. ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. ఆర్చర్ ఈజీ రిటర్న్ క్యాచ్ పట్టాడు. కుదురుకునేందుకు కాస్త టైమ్ తీసుకున్న రసెల్.. గోపాల్ వేసిన 13వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో స్కోరు వంద దాటించాడు. కానీ, ఆర్చర్ఓ పర్ఫెక్ట్ లెగ్ కట్టర్‌తో కార్తీక్ (1)ను కాట్ బిహైండ్ చేసి కేకేఆర్‌కు షాకిచ్చాడు. ఆ ఓవర్లో రెండే రన్స్ వచ్చాయి. ఆ వెంటనే రాజ్‌పుత్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా రసెల్ ఇంకో సిక్సర్‌తో ఊపు మీద కనిపించినా నెక్ట్స్ బాల్‌కే మరో షాట్ ఆడి ఎక్స్‌ట్రా కవర్లో ఉనాద్కట్‌కు చిక్కడంతో కేకేఆర్115/5తో మరింత డీలా పడింది. కానీ, ఆర్చర్ లాస్ట్ ఓవర్లో మోర్గాన్ 4, 6తో 14 రన్స్ రాబట్టాడు. కాసేపు అతనికి సపోర్ట్ ఇచ్చిన కమిన్స్ (12) కరన్ వేసిన 18వ ఓవర్లో శాంసన్ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆఖర్లో నాగర్కోటి (8 నాటౌట్) ఓ బౌండ్రీ కొట్టగా.. లాస్ట్ ఓవర్లో మోర్గాన్ సిక్సర్ సహా 16 రన్స్ రావడంతో కేకేఆర్170 ప్లస్ స్కోరు చేసింది.
రాయల్స్ తుస్
కష్టసాధ్యం కాని టార్గెట్ ఛేజింగ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘోరంగా విఫలమైంది. స్కోరుబోర్డుపై 50 రన్స్ చేరేలోపే సగం టీమ్ డగౌట్ చేరింది. ఫస్ట్ స్పెల్‌లో ఆసీస్ స్పీడ్ స్టార్ పాట్ కమిన్స్ (1/13), ఇండియా యంగ్‌గన్ శివమ్ మావి, తర్వాత మరో యువ బౌలర్ కమలేశ్ నాగర్కోటి దెబ్బకు ఆ టీమ్ టాప్, మిడిలార్డర్ కుదేలైంది. ఫస్ట్ ఓవర్లో నరైన్ (1/40)కు ఓపెనర్ జోస్ బట్లర్ సిక్సర్‌తో స్వాగతం పలికినా.. రెండో ఓవర్ నుంచే రాయల్స్ పతనం మొదలైంది. తన ఆసీస్ టీమ్‌మేట్ కమిన్స్ లెగ్ స్టంప్‌పై వేసిన గుడ్‌లెంగ్త్ బాల్‌కు కన్ఫ్యూజ్ అయిన ఓపెనర్ స్మిత్ (3) కీపర్ దినేశ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆపై, మావి బౌలింగ్‌లో లైన్‌కు అడ్డంగా పుల్ షాట్ ఆడిన శాంసన్ (8) మిడాన్‌లో నరైన్‌కు చిక్కాడు. ఊపు మీద కనిపించిన బట్లర్.. ఏడో ఓవర్లో మావి వేసిన షార్ట్ వైడ్ బాల్‌ను నేరుగా థర్డ్‌మ్యాన్‌లో ఉన్న వరుణ్ చక్రవర్తి చేతుల్లోకి కొట్టి వెనుదిరిగాడు. నెక్ట్స్ ఓవర్లోనే యంగ్ బౌలర్ నాగర్కోటి ప్రత్యర్థి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. నాలుగు బంతుల తేడాతో ఊతప్ప (2), పరాగ్ (1)లను ఔట్ చేయడంతో రాజస్తాన్ 42/5తో దిక్కుతోచని స్థితిలో నిలిచింది. లాస్ట్ మ్యాచ్‌లో సునామీ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన తెవాటియా క్రీజులో ఉండడంతో కాస్త ఆశలు కనిపించాయి. నాగర్కోటి బౌలింగ్‌లో ఓ సిక్సర్ కొట్టిన అతను… స్పిన్నర్ చక్రవర్తి వేసిన 11వ ఓవర్లో లైన్ మిస్సయి క్లీన్ బౌల్డ్ అవడంతో రాయల్స్ ఓటమి ఖాయమైంది. కాసేపటికే శ్రేయస్ గోపాల్ (5) నరైన్‌కు వికెట్ ఇవ్వగా.. చక్రవర్తి బౌలింగ్‌లో లాంగాన్‌లో నాగర్కోటి పట్టిన సెన్సేషనల్ క్యాచ్‌కు జోఫ్రా ఆర్చర్ (6) ఔటయ్యాడు. ఆఖర్లో టామ్ కరన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. నరైన్ వేసిన 19వ ఓవర్లో 3 సిక్సర్లు బాది 35 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ, అతని పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
కోల్‌కతా: గిల్ (సి అండ్ బి) ఆర్చర్ 47, నరైన్ (బి) ఉనాద్కట్ 15, రాణా (సి) పరాగ్ (బి) తెవాటియా 22, రసెల్ (సి) ఉనాద్కట్ (బి) రాజ్‌పుత్ 24, కార్తీక్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 1, మోర్గాన్ (నాటౌట్) 34, కమిన్స్ (సి) శాంసన్ (బి) కరన్ 12, నాగర్కోటి (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: 20 ఓవర్లలో 174/6; వికెట్ల పతనం: 1–36, 2–82,3–89, 4–106 , 5–115, 6–149; బౌలింగ్: ఆర్చర్ 4–0–18–2, రాజ్‌పుత్ 4–0–39–1, ఉనాద్కట్ 2–0–14–1, టామ్ కరన్ 4–0–37–1, గోపాల్ 4–0–43–0, పరాగ్ 1–0–14–0, తెవాటియా 1–0–6–1.
రాజస్తాన్: బట్లర్(సి) చక్రవర్తి (బి) మావి 21, స్మిత్ (సి) కార్తీక్ (బి) కమిన్స్ 3, శాంసన్ (సి) నరైన్ (బి) మావి 8, ఊతప్ప (సి) మావి (బి) నాగర్కోటి 2, పరాగ్ (సి) గిల్ (బి) నాగర్కోటి 1, తెవాటియా (బి) చక్రవర్తి 14, కరన్ (నాటౌట్) 54 , గోపాల్ (సి) కార్తీక్ (బి) నరైన్ 5, ఆర్చర్ (సి) నాగర్కోటి (బి) చక్రవర్తి 6, ఉనాద్కట్ (సి) నాగర్కోటి (బి) కుల్దీప్ 9, రాజ్‌పుత్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 137/9; వికెట్ల పతనం: 1–15, 2–30, 3–39, 4–41, 5–42, 6–66, 7–81, 8–88, 9–106 ; బౌలింగ్: నరైన్ 4–0–40–1, కమిన్స్ 3–0–13–1, శివమ్ మావి 4–0–20–2, నాగర్కోటి 2–0–13–2, చక్రవర్తి 4–0–25–2, కుల్దీప్ 3–0–20–1.