IND vs ENG 2025: సిరీస్‌లో రెండోది.. ఇంగ్లాండ్‌లో నాలుగోది: లార్డ్స్‌లో సెంచరీతో చెలరేగిన రాహుల్

IND vs ENG 2025: సిరీస్‌లో రెండోది.. ఇంగ్లాండ్‌లో నాలుగోది: లార్డ్స్‌లో సెంచరీతో చెలరేగిన రాహుల్

క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ లో సెంచరీ కొట్టడం ఎవరికైనా ప్రత్యేకమే. ముఖ్యంగా టెస్టుల్లో ఈ ఘనతను అందుకుంటే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అయితే టీమిండియా వెటరన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లార్డ్స్ లో తన రెండో సెంచరీని అందుకున్నాడు.   ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో 13 ఫోర్లతో 176 బంతుల్లో రాహుల్ తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. 2021 లో లార్డ్స్ లో కేఎల్ సెంచరీ కొట్టడం విశేషం. రాహుల్ టెస్ట్ కెరీర్ లో ఇది 10 సెంచరీ కాగా.. ఈ సిరీస్ లో రెండోది. అంతకముందు లీడ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో రాహుల్ సెంచరీ కొట్టాడు. 
ALSO READ | IND vs ENG 2025: రాహుల్, పంత్ భారీ భాగస్వామ్యం.. రసవత్తరంగా లార్డ్స్ టెస్ట్

మూడో రోజు లంచ్ తర్వాత 66 ఓవర్ నాలుగో బంతికి ఆర్చర్ బౌలింగ్ లో సింగిల్ తీసి రాహుల్ ప్రతిష్టాత్మక గ్రౌండ్ లో శతకాన్ని అందుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై  రాహుల్ టెస్టుల్లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ఈ సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న రాహుల్ లార్డ్స్ టెస్టులో ఒక్కడే పోరాడుతూ టీమిండియాను ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. సెంచరీ తర్వాత రాహుల్ బషీర్ బౌలింగ్ లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీమిండియా ఐదో వికెట్ ను కోల్పోయింది. 

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 112.3 ఓవర్లలో 387 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. జో రూట్ (104) సెంచరీ పూర్తి చేసుకోగా.. బ్రైడన్ కార్స్‌‌‌‌ (56), జేమీ స్మిత్ (51) ఫిఫ్టీలతో రాణించారు. బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ (2/85) రెండు వికెట్లు తీశాడు.