ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్, అలాగే మూడు మ్యాచ్‌ల వన్డే (ODI) సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం జట్లను ప్రకటించింది. చీఫ్ సెలక్టర్ అజిత్ అగర్కర్, బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు ఫార్మాట్లకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, వైస్ కెప్టెన్సీ మార్పులు, సీనియర్ల విశ్రాంతి, కొత్త ఆటగాళ్ల ఎంపిక హాట్ టాపిక్‌గా మారింది.
వైస్ కెప్టెన్గా కేఎల్ రాహుల్:
వైట్-బాల్ క్రికెట్‌లో వరుసగా విఫలమవుతూ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు కాస్త ఒత్తిడి తగ్గించేందుకు సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అతన్ని టెస్ట్ వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, ఆ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. అయితే పంత్ కేవలం వికెట్ కీపర్ బ్యాటర్‌గా జట్టులో కొనసాగుతాడు.
జడేజా, బుమ్రాలకు రెస్ట్:
వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు టెస్ట్ క్రికెట్ నుంచి రెస్ట్ ఇచ్చారు. వారి స్థానాల్లో గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలను ఎంపిక చేశారు. జడేజా టెస్టుల్లో ఇప్పటికీ నంబర్ వన్ స్పిన్నర్ అని అగర్కర్ స్పష్టం చేసినప్పటికీ, వన్డేల్లో మాత్రం అతని భవిష్యత్తుపై సస్పెన్స్ నెలకొంది. రాబోయే సౌతాఫ్రికా టూర్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీమిండియా మేనేజ్‌మెంట్ వన్డేల్లో జడేజా కంటే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఇతర యువ బౌలర్ల వైపు చూస్తున్నట్లు హింట్ ఇచ్చింది.
►ALSO READ | రిటైర్మెంట్ ప్రకటించని MS ధోని.. చెపాక్‌లో భావోద్వేగానికి గురైన ఫ్యాన్స్! 2027లో ‘తలా’ రీఎంట్రీ?
ఫిట్‌నెస్ ఆధారంగా రోహిత్, హార్దిక్ ఎంపిక:
వన్డే జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. కానీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాల ఎంపిక వారి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో బాధపడుతూ ప్లేయింగ్ XI కి దూరంగా ఉన్నాడు. నెట్స్‌లో ఒంటరిగా బ్యాటింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు. రోహిత్ శర్మ సైతం ఫామ్‌లో ఉన్నా, 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసేంత ఫిట్‌గా ఉన్నాడా లేదా అనే సందేహాలు ఉన్నాయి. వీరు గనుక ఫిట్‌నెస్ నిరూపించుకోకపోతే టీమ్‌లో మార్పులు ఉంటాయి.
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు భారత జట్లు ఇవే:
టెస్ట్ జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషభ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, హర్ష్ దూబే.
వన్డే జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ*, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా*, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.
