ఉత్తర తెలంగాణకు వరంలా కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

ఉత్తర తెలంగాణకు వరంలా కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

వరంగల్‍, వెలుగు : కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన(పీఎంఎస్‍ఎస్‍వై)’ పథకంలో భాగంగా వరంగల్‍ కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో ఏర్పాటు చేసిన సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ ఉత్తర తెలంగాణకు వరంలా మారింది. గుండె, మూత్రపిండాలు, క్యాన్సర్‍, నరాలు, గ్యాస్ట్రో, చిన్న పిల్లలు, మోకాలి చిప్ప సమస్యలతో వచ్చే పేషెంట్లకు కొండంత అండగా నిలుస్తోంది. లక్షల రూపాయలు ఖర్చుచేసి హైదరాబాద్‍ వెళ్తే తప్ప దొరకని ట్రీట్‍మెంట్‍ లోకల్‍గా అందుతుండడంతో వారానికి రెండ్రోజులపాటు ఉండే ఓపీకి వేలాది మంది క్యూ కడుతున్నారు. హాస్పిటల్‍ ఎక్విప్‍మెంట్‍, డాక్టర్లపై నమ్మకంతో ఇక్కడే సర్జరీలు చేయించుకుంటున్నారు. గడిచిన 10 నెలల కాలంలో వేలాది మంది తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. 18 ఏండ్ల తర్వాత ఓరుగల్లులో ఇదే హాస్పిటల్లో డాక్టర్లు మళ్లీ విజయవంతంగా బైపాస్‍ సర్జరీ నిర్వహించి అందరి మనసులు చూరగొన్నారు.

గుండె సమస్యలతో నెలకు 6 వేల ఓపీ
ఉమ్మడి వరంగల్‍, కరీంనగర్, ఖమ్మం​లాంటి జిల్లాల్లో ఏడాది కింది వరకు ఎవరైనా గుండెనొప్పి బారిన పడ్డారంటే.. అప్పుసప్పు చేసి ప్రైవేట్‍ వెహికల్‍ తీసుకుని హైదరాబాద్‍ వెళ్లాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వం రూ.150 కోట్లతో ఆరు అంతస్తుల్లో 250 బెడ్లతో కేఎంసీ ఆవరణలో సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍ ఏర్పాటు చేయగా.. ఈ ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయిలో సర్జరీలు చేయడం స్టార్ట్ చేశారు. దీంతో లోకల్‍గానే ఈసీజీ, 2డీ ఎకో, స్టంట్లు వేయడం మొదలు బైపాస్‍ సర్జరీ(కార్డియోథెరాసిక్‍ అండ్‍ వస్క్యూలర్‍ సర్జరీస్​) వరకు ఉచిత సేవలు అందుతున్నాయి. హాస్పిటల్ లో వారానికి రెండ్రోజుల చొప్పున నెలకు ఎనిమిది సార్లు పేషెంట్లకు ఓపీ చికిత్స ఇస్తున్నారు. ప్రతిసారి 700 నుంచి 800 మంది వస్తున్నారు. నెలలో దాదాపు 6 వేల కంటే ఎక్కువ మంది గుండె సమస్యలతో ఇక్కడ ట్రీట్‍మెంట్‍ తీసుకుంటున్నారు. ఈసీజీ, టూడీ ఎకో, స్టంట్లు, ఆపరేషన్ల కోసం వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 

న్యూరో, యూరాలజీ, పిడియాట్రిక్‍ కూడా..
నరాలు, మూత్రపిండాలు, చిన్న పిల్లల్లో అనారోగ్యం సమస్యలతో వచ్చే పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. నరాలు(న్యూరాలజీ), మూత్రపిండాలు(యూరాలజీ), పిడియాట్రిక్ సర్జన్‍ కోసం వచ్చే ఓపీలు నెలకు దాదాపు 5 వేల నుంచి 6 వేలు దాటుతోంది. గడిచిన 10 నెలల్లో హాస్పిటల్లో అత్యధికంగా మూత్రపిండాలు సంబంధిత సమస్యల్లో 587 మందికి ఆపరేషన్లు నిర్వహించారు. 299 మంది పిల్లలకు అవసరమైన సర్జరీలు చేశారు. ఇవేగాక అంకాలజీ (క్యాన్సర్‍) పేషెంట్లకు75 మందికి, గ్యాస్ట్రో 42 మందికి అవసరమైన అత్యాధునిక సర్జరీలను నిర్వహించడం ద్వారా పీఎంఎస్‍ఎస్‍వై హాస్పిటల్‍ పేషెంట్లకు కొత్త  జీవితాలను ప్రసాదించింది. వరంగల్‍ ఎంజీఎంలో ఆర్దో విభాగంలో ఎముకలు విరిగిన కేసుల్లో సర్జరీలు నిర్వహిస్తుండగా.. గతంలో మోకాలి చిప్ప మార్పిడికి బాధితులు హైదరాబాద్‍ వెళ్లాల్సి వచ్చేది. కేఎంసీ సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్లో దీనికోసం ప్రత్యేకంగా ఓ యూనిట్ పనిచేస్తోంది. ఇప్పటికే 77మందికి డాక్టర్లు ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించారు.

బెస్ట్ ట్రీట్‍మెంట్‍ ఇస్తున్నం
పీఎంఎస్‍ఎస్‍వై సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్‍కు వచ్చే పేషెంట్లకు బెస్ట్ ట్రీట్‍మెంట్‍ అందిస్తున్నాం. హైదరాబాద్‍ ప్రైవేట్‍ హస్పిటల్స్ తరహాలో వరంగల్‍ లో కావాల్సిన ఎక్విప్‍మెంట్‍, క్వాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. జనాల్లో నమ్మకం పెరగడంతో రోజురోజుకూ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది.     – డాక్టర్‍ గోపాల్‍రావు, హాస్పిటల్‍ నోడల్‍ ఆఫీసర్‍ 

18 ఏండ్ల తర్వాత బైపాస్ సర్జరీ
ఉమ్మడి వరంగల్‍ జిల్లాలో 18 ఏండ్ల తర్వాత సెప్టెంబర్‍ 28న సూపర్‍ స్పెషాలిటీ హాస్పిటల్లో మళ్లీ ఓపెన్‍ హర్ట్‍ సర్జరీని డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. 2004లో బెస్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గా పేరున్న అమరావతి ప్రభాకరాచారి ఎంజీఎంలో ఇలాంటి ఆపరేషన్‍ చేయగా.. మళ్లీ ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. పీఎంఎస్‍ఎస్‍వై హాస్పిటల్​లో కావాల్సిన ఎక్విప్‍మెంట్‍ ఉండటంతో డాక్టర్లు ఇక్కడే సర్జరీ చేసేలా అడుగులు వేసి సక్సెస్‍ అయ్యారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన స్వప్న అనే పేషెంట్‍కు బైపాస్‍ సర్జరీ అవసరం ఉండగా 29 నిమిషాలు గుండె పనితనాన్ని ఆపి.. పెరికార్డియం ప్రక్రియలో డాక్టర్ల బృందం ఆపరేషన్‍ నిర్వహించారు.