పహల్గామ్ కుట్ర ప్లాన్ 2 నెలల ముందే జరిగిందా..? బయటపెట్టిన అమెరికా సంస్థ

పహల్గామ్ కుట్ర ప్లాన్ 2 నెలల ముందే జరిగిందా..? బయటపెట్టిన అమెరికా సంస్థ

Pahalgam Satellite Images: దాదాపు మూడు వారాల కిందట పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. ఉగ్రవాదులు అక్కడి టూరిస్టులను చంపిన తీరు, దేశంలో మతఘర్షణలు రెచ్చగొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు చాలా మంది కుటుంబాల్లో తమ ప్రియమైనవారిని కోల్పోయేలా చేసింది. ఆర్మీ నిపుణులు సైతం గతంలో ఈ తరహా దాడులు జరగలేదని, ఉగ్రవాదులు ఈసారి కొత్త ప్యాట్రన్ ఫాలో అయ్యారని దీనిపై తమ అనుభవాలను పంచుకుంటున్నారు. కానీ ఈ కుట్రకు భీజం దాదాపు రెండు నెలల కిందట ఫిబ్రవరిలోనే పడిందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 

అమెరికా చెందిన స్పేస్ టెక్ కంపెనీ Maxar Technologies రెండు నెలల కిందట తమకు పహల్గామ్ ప్రాంతానికి చెందిన హై రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాల కోసం భారీగా ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది. ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 22 మధ్య కాలంలో ఏకంగా ఇందుకోసం 12 ఆర్డర్లు వచ్చాయని చెప్పింది. అయితే ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ఆ ప్రాంతంలో మృతి చెందారు. 

ఉగ్రవాద దాడితో పాకిస్తాన్‌కు సంబంధం ఉందని నిరూపించే సంకేతాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. కుట్ర కోసం పహల్గామ్ ఉపగ్రహ చిత్రాల ఆర్డర్‌లు జూన్ 2024 నుంచే స్టార్ట్ అయ్యాయని పోర్టల్ లోని సమాచారం చెబుతోంది. అమెరికాలోని ఫెడరల్ నేరాలతో సంబంధం ఉన్న పాకిస్తాన్‌కు చెందిన జియో-స్పేషియల్ కంపెనీ అయిన బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (BSI)తో మాక్సర్ భాగస్వామ్యం కుదుర్చుకున్న కొద్ది నెలల తర్వాత ఉగ్రదాడి జరగింది. అంటే పాకిస్థాన్ సంస్థ పహల్గామ్ శాటిలైట్ ఇమేజెస్ ఉగ్రవాదులకు చేరవేసిందని ఇక్కడ అర్థం అవుతోంది. అయితే ఇక్కడ పాకిస్థా్న్ నుంచి ఆర్డర్లు వచ్చాయా అనే విషయానికి ఎలాంటి ఆధారాలు లేవు. రక్షణ రంగం నిపుణులు మాత్రం ఇది యాదృచికంగా జరిగింది కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే పాకిస్థాన్ సంస్థ డేటాను ఉగ్రవాదులకు చేరవేసిందని వారు అభిప్రాయపడుతున్నారు. 

వాస్తవానికి బిజినెస్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవస్థాపకుడు ఒబయదుల్లా సయ్యద్. అతను అమెరికా నుంచి అక్రమంగా తప్పుడు పత్రాలతో పాకిస్థాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ కోసం హైపర్ఫామింగ్ కంప్యూటర్ పరికరాలు, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ పరిష్కారాలను ఎగుమతి చేసినట్లు అమెరికా గుర్తించింది. 2006 నుంచి 2015 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు పాకిస్థాన్ అణు కార్యక్రమాలకు సయ్యద్ సాయం చేసినట్లు అమెరికా అధికారులు గుర్తించారు. అమెరికాలో వ్యాపారం స్థాపించిన సయ్యద్ సరైన పత్రాలు లేకుండా పాకిస్థానుకు సాయం చేశాడని అధికారులు కనుగొన్నారు. ప్రస్తుతం పహల్గామ్ దాడి కోసం సయ్యద్ పరిచయాలను పాకిస్థాన్ ప్రభుత్వ ఏజెన్సీలు ఉపయోగించుకుని ఉగ్రవాదులకు సహాయం చేశాయని తెలుస్తోంది.