Moral Story : విలువ తెలుసుకు మసలు.. తినే వస్తువులు వృథా చేస్తే జరిమానా విధిస్తారు

Moral Story : విలువ తెలుసుకు మసలు.. తినే వస్తువులు వృథా చేస్తే జరిమానా విధిస్తారు

‘పింకీ రేపు సెలవు కదా ఎక్కడికి వెళ్దాం’’ అన్నాడు నాన్న. ‘‘అయ్.. నాన్న మనల్ని తీసుకెళ్తా అంటున్నాడు రేయ్.. పండు త్వరగా చెప్పు ఎక్కడికి వెళ్లాలో” అంది పింకీ..‘‘అక్కా మనల్ని ఎక్కడికి తీసుకు వెళ్ళాలో నాన్న ఇదివరకే ఆలోచించి ఉంటారు. మన కన్నా నాన్నకే బాగా తెలుసు’’ అంటూ టక్కున సోఫాలో వచ్చి నాన్న పక్కన కూర్చున్నాడు.

పిల్లల మాటలకు చిన్న నవ్వు నవ్వి ‘‘రేపు మనందరం కలసి మన కార్​లో బయటకు వెళ్తున్నాం. వెళ్లి త్వరగా పడుకోండి” అన్నాడు నాన్న.ఉదయాన్నే అందరూ సిద్ధమై కారులో బయలుదేరారు. టిఫిన్ చేసి టైంకి కారు ఒక ఊరిలో ఒక పెంకుటిల్లు ముందు నిలిపాడు. అదేంటి నాన్న ఇక్కడ ఆపారు. ఇక్కడ ఏదో ఇల్లు ఉంది హోటల్ ఎక్కడ అంటూ అందరూ అయోమయంలో ఉన్నారు. 

అక్కడున్న ఒక పెద్దాయన ‘‘బాబు చెప్పులు బయట వదిలి  ఆ గుండిగలో ఉన్న నీళ్లతో కాళ్ళు కడుక్కొని వెళ్లండి’’ అన్నారు. ఇంతవరకు తాము తిన్న ఏ హోటల్లో కూడా కనీసం చెయ్యి కడుకున్నారా లేదా అని కూడా అడగరు. అలాంటిది ఇక్కడ కాళ్లు కడుక్కోమని చెబుతున్నారు అంటూ అలానే చేసి లోపలకు వెళ్లారు. లోన పెద్ద హాలు అందులో నాలుగు మూలల నాలుగు చల్లని మట్టి కుండలు పెట్టి దానిపై మట్టి గ్లాసులు ఉంచారు.

 అంతే కాదు అందరూ అక్కడున్న పీటలపై కూర్చున్నారు. వెంటనే వారి ముందు పచ్చని అరిటాకు ఉంచారు. దానిలో నాన్న ముందే చెప్పిన వేడి వేడి మినపట్టు, పెసరట్టును ఉంచారు. దానిలోకి కొబ్బరి పచ్చడి వేశారు. అంతా చూడటానికి తినడానికి ఆరోగ్యకరంగా ఉంది. నిజంగా అందరూ ఒక చక్కని అనుభూతితో టిఫిన్స్ చేశారు. పిల్లలు ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలాంటి చోటు ఉంటుంది అని అసలు అనుకోలేదు. తిన్న తరువాత బిల్లు కట్టడానికి వెళ్ళారు. చాలా బాగుంది అని వారిని అభినందించి, ఎంత అన్నారు? 

ఫలానా మొత్తం అని చెప్పారు యజమాని , మేము తిన్నదాని ప్రకారం, మీరు వేసిన సూచిక బోర్డు ప్రకారం అంత కాలేదు అన్నారు వారు. అందుకు యజమాని ‘‘అయ్యా, మీరు తిన్న ఆహారానికి అయిన డబ్బుతో పాటు మీ పిల్లలు ఇద్దరూ కొంత ఆహారాన్ని వాళ్ల పళ్లెంలో వదిలి పెట్టేశారు అది ఇప్పుడు వృథా కదా? అందుకు జరిమానా కట్టాలి” అన్నాడు. 

కోపంతో ‘‘అదేంటండి పిల్లలు కాస్త తినలేక ఆకులో మిగిలిస్తే దానికి డబ్బు కట్టాలా? అయినా ఇలా ఇప్పటివరకు నేను ఏ హోటల్​లో కూడా చూడలేదు. ఇలాంటివి చేస్తే రేపటినుంచి మీ హోటల్​కు ఎవ్వరూ రారు” అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు.

‘‘అయ్యా... కాస్త ఆగండి ఎందుకంత కంగారు పడుతున్నారు. ఎక్కడైనా మీరు తిన్నదానికి మాత్రమే డబ్బు వసూలు చేస్తారు. కానీ, ఇక్కడ మనం పడేసే అంత తిండి దొరక్క ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? అలాంటిది ఒక్కసారైనా ఇలా అడిగి, వచ్చిన పెద్దలకు గుర్తు చేయడం, పిల్లలకు వివరించి చెప్పడం మంచిది కదా! అందునా ఇలాంటి సంఘటనల వల్ల కొద్ది మందిలో మార్పు వచ్చి ఆహార పదార్థాలను వృథా చేయకుంటే మంచి జరుగుతుంది కదా!’’ అంటూ వాళ్ల బిల్లు నుంచి కొంత తీసేశాడు.

దాంట్లో ఉన్న నీతిని అర్థం చేసుకున్న వాళ్లందరిలో మార్పు వచ్చింది. అందరిలో మార్పు కోరుతున్న వాళ్లకు కృతజ్ఞతలు చెప్పి, అప్పటినుంచి ఇంటాబయట ఆహార పదార్థాలను వృథా చేయడం మానివేశారు.

- సింగంపల్లి శేష సాయికుమార్-