ధరణి లోపాలు ఒక్కొక్కటి..బయట పడుతున్నయ్​ : కోదండ రెడ్డి, జగ్గారెడ్డి

ధరణి లోపాలు ఒక్కొక్కటి..బయట పడుతున్నయ్​ : కోదండ రెడ్డి, జగ్గారెడ్డి
  •     కేసీఆర్ పాపాలను కడగాలంటే బ్యారల్ ఫినాయిల్ కావాలి :  కోదండ రెడ్డి, జగ్గారెడ్డి
  •     కేటీఆర్ శాఖలోని అక్రమాలకు ఆయనే బాధ్యత వహించాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు :  బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్​లో భూముల అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని కిసాన్​ కాంగ్రెస్​జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, పీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి తెలిపారు. కేసీఆర్​పాపాలు, లోపాలను కడగాలంటే ఫినాయిల్​ బ్యారళ్లు​ కావాలని ఎద్దేవా చేశారు. ధరణి సమస్యలపై అప్పటి సీఎస్​ సోమేశ్​ కుమార్ ఎంత చెప్పినా చెవిటివాడి ముందు శంఖమూదినట్టే అయ్యిందని వారు విమర్శించారు. సోమవారం గాంధీ భవన్​లో వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైనా కాంగ్రెస్ నేతలే చేశారని.. 

కానీ, కేసీఆర్ కుటుంబం తెలంగాణ సెంటిమెంట్​ను వాడుకున్నదని కోదండరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోచుకున్నారని ఆరోపించారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఎక్కడా అంటూ ఓ మాజీ మంత్రి అడుగుతున్నారని.. ఎంఎస్ పీ కంటే తక్కువ వస్తే బోనస్​ ఇస్తామన్న విషయాన్ని ఆయన మర్చిపోయారని గుర్తుచేశారు. రైతులు క్వింటాల్ ధాన్యాన్ని​రూ.2,600 కు అమ్ముతున్నారని ఆయన తెలిపారు. పంటరుణాలు ఏకకాలంలో మాఫీ చేసిన చరిత్ర తమదేనని, ఇప్పుడు కూడా ఒకేసారి చేస్తామని చెప్పారు. హెచ్​ఎండీఏలో చిన్న అధికారిని పట్టుకుంటే ఐఏఎస్​ల పేర్లు చెప్తున్నారు.. 

ఈ శాఖ కేటీఆర్ వద్దే ఉండేది కాబట్టి  దీంట్లో ఎవరెవరు ఉన్నారో బయట పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఫార్మా సిటీ భూముల సమస్యలన్నింటి పై కోదండ రెడ్డి కొట్లాడారని, అలాగే ధరణిలో అవకతవకలు కూడా బయటకు తీయాలన్నారు. తొమ్మిదేండ్ల తర్వాత అసెంబ్లీలో మూడున్నర గంటల చర్చ జరిగిందని

 సంప్రదాయం పాటించని పార్టీ బీఆర్ఎస్​అన్నారు. కేసీఆర్​ ప్రతిపక్ష నాయకుడిగా సభకు రావాలని సీఎం అడిగే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. సమావేశంలో ఫిషర్​మెన్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మెట్టుసాయి, దళిత కాంగ్రెస్​ అధ్యక్షుడు ప్రీతం తదితరులు పాల్గొన్నారు.