టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
నిజామాబాద్ స్పోర్ట్స్, వెలుగు: రాజకీయాల్లో మార్పులు జరిగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని టీజేఎస్ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం గత ఐదేళ్లలో ఏం చేసింది.. వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తారనేది చర్చించేందుకు ఎన్నికలు వేదికగా ఉండాలన్నారు. ప్రధానంగా మున్సిపాలిటీలో పచ్చదనం, పరిశుభ్రత ఉండాలన్నారు. కానీ నిజామాబాద్లో ఎక్కడ పచ్చదనం, పరిశుభ్రత కనిపించలేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో విధ్వంసం చేశారన్నారు. ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ కోసం భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఆహ్లాదం కోసం పార్కులు సైతం కరువయ్యయన్నారు. అవేం పట్టించుకోకుండా ఎలక్షన్లలో డబ్బు, మందు ఎరగా వేసి గెలవాలని చూస్తున్నారన్నారు. ఈ పరిస్థితిలో మార్పును కోరుకుంటూ టీజేఎస్ ప్రత్యేక కార్యక్రమంతో ప్రజల ముందుకు వస్తుందని తెలిపారు.
