
- భూ పరిపాలనలో మార్పు రావాలి: ప్రొ. కోదండరాం
- బేగంపేటలో డిప్యూటీ కలెక్టర్ల ఆత్మీయ సమ్మేళనం
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం భూ పరిపాలనలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో గ్రామాల్లో గందరగోళం నెలకొందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గ్రామాల్లో ఫ్యాక్షనిజం వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలకు భూమి హక్కులు దక్కకపోవడంతోనే అశాంతి నెలకొందన్నారు. తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం ఆత్మీయ సమ్మేళనం ఆదివారం బేగంపేటలోని హోటల్ మారిగోల్డ్‌లో జరిగింది. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనానికి ప్రొ.కోదండరాం, ప్రొ.పీఎల్ విశ్వేశ్వరరావు, భూమి సునీల్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో భూ పరిపాలన వ్యవస్థలో సమూల మార్పు రావాలని కోదండరాం అన్నారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి భూ సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగులను మాజీ సీఎం కేసీఆర్ అకారణంగా బద్నాం చేసి.. అన్ని రకాల భూములను మాయం చేశారని ఆరోపించారు. సమాజం ముందు రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించి ఉన్న భూములను కాజేశారన్నారు. రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి భూ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయాలని భూమి సునీల్‌కుమార్ పేర్కొన్నారు. ఏపీలో గ్రామ స్థాయిలో 8 మంది ఉద్యోగులుండగా.. మన రాష్ట్రంలో ఒక్కరూ కూడా లేరన్నారు. రెవెన్యూలో 124 చట్టాలుండగా.. అవి గందరగోళంగానే ఉన్నాయన్నారు. వీటిన్నింటిని కలిపి ఒకే చట్టం చేయాలని సూచించారు. భద్రమైన హక్కులను కల్పించేలా టైటిల్ గ్యారంటీ తేవాలన్నారు. ఉద్యోగులుగా హక్కులను కాపాడుకుంటూనే ప్రజలకు సేవకులుగా పని చేద్దామని వి.లచ్చిరెడ్డి తెలిపారు.
నూతన కమిటీ ఎన్నిక
సమ్మేళనంలో భాగంగా డిప్యూటీ కలెక్టర్ల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా వి.లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా కె.రామకృష్ణ, ఎన్.ఆర్.సరిత, సెక్రటరీ జనరల్‌గా రమేష్ రాథోడ్, కోశాధికారిగా కె.వెంకట్‌రెడ్డి తదితరులు ఎన్నికయ్యారు.