
జులై 25వ తేదీన చలో సెక్రటేరియట్ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్. ప్రజాస్వామిక తెలంగాణ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. రాష్ట్రం ఆర్ధిక సమస్యలలో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఉద్యోగాల భర్తీ, పథకాలకు కూడా పైసలు లేవన్నారు. సెక్రటేరియట్ ఎందుకు కూల్చుతున్నారో ప్రభుత్వం హేతుబద్ధమైన కారణం చెప్పడం లేదన్నారు. అట్టహాసం కోసం కొత్త సెక్రటేరియట్ కడుతున్నారని విమర్శించారు.
“రాష్ట్రంలో చాలా మందికి రుణమాఫీ అమలు కాలేదు. బీమా అమలు కాలేదు. పెన్షన్ లు వస్తే బ్యాంక్ వాళ్ళు ఆపుకుంటున్నారు” ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు కోదండరామ్. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో G. వెంకటస్వామి ఫౌండేషన్ నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణ వేదిక ఆధ్వర్యంలో ‘సెక్రటేరియట్ కూల్చివేత – కొత్త అసెంబ్లీ నిర్మాణం’పై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.