- మంత్రుల వెంటపడి ప్రజలు పనులు పూర్తి చేయించాలి: సీఎం
- 220 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్
- 2 నెలల్లో కృష్ణా-వికారాబాద్ రైల్వే లైన్
- వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్/కొడంగల్, వెలుగు: మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఏడాదిన్నరలోపు పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మంత్రుల వెంటపడి పనులను పూర్తి చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో శుక్రవారం మధ్యాహ్నం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన ఆయన హెలీప్యాడ్నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు.
రూ.110 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. దౌల్తాబాద్‌లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, కోస్గిలో వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణ పనులకు అక్కడి నుంచే పర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కొడంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రాజెక్టు పురోగతిపై ప్రతి నెలా ఆఫీసర్లతో సమీక్షించాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు.
‘‘ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కొడంగల్ భూముల్లో కృష్ణా జలాలను పారించాలి. భూ సేకరణ ఇప్పటికే పూర్తి చేసినం. అనుమతులు కూడా తెచ్చినం. భూ సేకరణ సమయంలో చాలా సమస్యలు సృష్టించారు. అప్పుడు మంత్రి వాకిటి శ్రీహరికి ఎలాగైనా భూ సేకరణ పూర్తి చేయాలని చెప్పిన. ఆయన పేదలతో మాట్లాడి 15 రోజుల్లో 98 శాతం భూ సేకరణ పూర్తి చేయించిండు. కృష్ణానది నుంచి లక్షన్నర ఎకరాలకు నీళ్లు తెచ్చుకునే అకాశం ఉంది” అని పేర్కొన్నారు. 2009లో మీరు నాటిన మొక్క పెద్ద చెట్టై పండ్లు కాస్తోందని, ఆ చెట్టును కాపాడుకోవాలని ప్రజలకు సూచించారు.
డెడ్‌లైన్ డిసెంబర్..
కొడంగల్ నియోజకవర్గంలో అన్ని పనులనూ 2027 డిసెంబరులోగా పూర్తి చేయాలని ఆఫీసర్లను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ ప్రాంత ప్రజలు రైలును చూడలేదని, ఇప్పుడు కృష్ణా-, వికారాబాద్ రైల్వే లైన్ ద్వారా ఆ కల నెరవేరనున్నదని చెప్పారు. రెండు నెల్లలో ఈ రైల్వే లైన్ తెస్తామన్నారు. కొడంగల్‌లో సున్నపురాయి గనులున్నా పరిశ్రమలు కర్నాటకలోనే ఉన్నాయని, నియోజకవర్గంలోని టేకులకోడు ప్రాంతంలో 6 నెలల్లో సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
కొడంగల్‌కు పెద్ద కుర్చీ కదిలొచ్చిందని .. ఇదే అవకాశంగా ఈ ప్రాంత అభివృద్ధికి నీళ్లు, నిధులు, గుడి, బడి, వైద్యం తెచ్చుకుందామని అన్నారు. ‘‘కొడంగల్ నియెజకవర్గంలో రాజకీయాలు, గుంపులు పక్కన పెట్టండి. ఎన్నికలు వస్తుంటాయ్. పోతుంటాయ్.. కలిసి పని చేస్తూ కొడంగల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. దేశంలో ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే అందరూ కొడంగల్‌ను చూయించాలె” అని పేర్కొన్నారు.
‘‘సర్పంచులు ఏ పార్టీ నుంచి గెలిచినా పని చేయించుకోండి. పేదలకు ఇండ్లు, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు ఏం పనులు కావాలన్నా చేసుకోండి. కొడంగల్‌కు ఇంతకన్నా పెద్ద కుర్చీ రాదు. అవసరం ఉన్న పనులు అడగకపోతే రేపు మనల్నే అంటరు. కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు గ్రామాల్లో ఏం పనులు చేయాలో నోట్ చేసుకోండి. గ్రామాలకు వెళ్లి ప్రజలను కలవండి. ప్రతి మండలానికి ఒక టీం ఏర్పాటు చేయండి. ఇక్కడ జరుగుతున్న పనులను చూసి ఈ మార్గంగుండా వెళ్లే కర్నాటక ప్రజలు అసూయ పడాలి” అని అన్నారు.
పేదల తిరుపతిగా పేరు
55 ఏండ్ల కిందట నందారం నర్సింహులు కొడంగల్‌లో నిర్మించిన వేంకటేశ్వరస్వామి మందిరానికి తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన వారు వస్తారని, ఇది పేదల తిరపతిగా పేరుగాంచిందని సీఎం రేవంత్ తెలిపారు. తిరుపతి వెళ్లలేనివారు ఇక్కడ మొక్కుకునేవారని గుర్తు చేశారు. ఈ ఆలయాన్ని పునర్నిర్మించే గొప్ప కార్యాన్ని దేవుడి ఆదేశం మేరకు చేపడుతున్నట్టు చెప్పారు. దేశం గర్వించదగ్గ ఆగమశాస్త్ర సలహాదారు సుందర వరదాచార్యులు తిరుపతిలో స్వామి పూజలు, బ్రహ్మోత్సవాలు ఎప్పుడు నిర్వహించాలో టీటీడీకి చెప్పేవారని, అయనే ఇక్కడి వీధులు రథాన్ని నడపడానికి అనువుగా లేవని, ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారని గుర్తు చేసుకున్నారు.
ఆయన శాశ్వతంగా గుర్తుండిపోయేలా ఆలయ ప్రాంగణంలో ఏదో ఒక వసతిగృహానికి సుందర వరదాచార్యుల పేరు పెట్టాలని సీఎం సూచించారు. అనంతరం ఏడుకొండల వెంకన్న ఆలయాన్ని నిర్మించే అవకాశం సీఎం రేవంత్ రెడ్డికి రావడం పూర్వ జన్మసుకృతమని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ఆధ్యాత్మిక చింతన అంటే మాటలు చెప్పడం కాదని.. చేసి చూపించడమని పేర్కొన్నారు. సమాజ, ధార్మిక చింతన కలిగిన కమిట్‌మెంట్ ఉన్న లీడర్ సీఎం రేవంత్ రెడ్డి అని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశంసించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే పరిపూర్ణత కలిగిన నాయకుడిని రేవంత్‌రెడ్డి రూపంలో చూస్తున్నామని అన్నారు. తిరుమలలో స్వామి వారిని దర్శించుకోలేని భక్తులకు కొడంగల్ శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రం నుంచే ఇక్కడికి చదువుకోవడానికి రావాలి
కొడంగల్, బొంరాస్‌పేట, మద్దూరు, దౌల్తాబాద్‌కు చెందిన పిల్లలు చదువుకోవాలంటే వేరే ఊళ్లకుగానీ, పాలమూరు, ముంబైకి పోయేటోళ్లని.. కొడంగల్‌లో చదువుకోవడానికి బడి ఉండేదికాదని సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఈ ప్రాంతానికి తాగు, సాగునీరు అందించాలని గత పాలకులు అనుకోలేదని అన్నారు. ‘‘తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతం చంద్రవంచ.. ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చే అవకాశం లేదు. కృష్ణా పక్కనే పారుతున్నా కొడంగల్‌కు ఎవరూ నీళ్లు తెచ్చే ఆలోచన చేయలేదు.
అయితే కందులు పడించుకోవాలి.. లేదా కల్తీకల్లు తాగి బతకాలె. వడ్లు పండించినా సన్న బియ్యం తినేది లేదు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా.. ఇక్కడి ప్రజలు అమాయకత్వంతో బండలతో కప్పు వేసుకునేటోళ్లు. ఏ ఊరికి, తండాకు పోవాలన్నా రోడ్లు లేవు. ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీకి, తండాకు రోడ్లు వేసుకున్నాం. కొడంగల్‌కు మెడికల్, ఇంజినీరింగ్ డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, సైనిక్ స్కూళ్లు వచ్చాయి. 220 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్‌గా తయారు చేస్తున్నాం. ఆనాడు రాష్ట్రం నలు దిక్కుల మనం పోయేటోళ్లం. ఇప్పుడు రాష్ట్రంలో మంచి చదువు చదవాలంటే కొడంగల్‌కు పోవాలనేట్టు తీర్చిదిద్దుతున్నాం” అని పేర్కొన్నారు.
