మాటలకే పరిమితమైన కోహెడ ఫ్రూట్​ మార్కెట్​ నిర్మాణం

మాటలకే పరిమితమైన కోహెడ ఫ్రూట్​ మార్కెట్​ నిర్మాణం

ఎల్​బీనగర్, వెలుగు: ‘అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తున్నాం.. అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నాం’’ అని మంత్రులు సభలు, సమావేశాల్లో గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. సిటీలోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్​ను రంగారెడ్డి జిల్లా కోహెడకు తరలించి మూడేండ్లు దాటినా ఇంత వరకు అక్కడ ఎలాంటి నిర్మాణం జరగలేదు. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్​నే ఆమోదించలేదు. అది వస్తే అధికారులు డీపీఆర్​(డీటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్ట్) రెడీ చేసి ప్రభుత్వ అప్రూవల్​కు పంపాల్సి ఉంటుంది. ఇదంతా జరగడా
నికి ఇంకెన్నేళ్లు పడుతుందో తెలియడం లేదు. తాత్కాలిక మార్కెట్​లో రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రూ.400 కోట్లతో కట్టాలని..

ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కోహెడలోని 178.9 ఎకరాల్లో కొత్త ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి,  2020లో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్​ను ఖాళీ చేయించింది. కోహెడలో రూ.5కోట్లతో తాత్కాలిక షెడ్డు నిర్మించింది. తరలించిన కొద్ది రోజుల్లోనే ఆ షెడ్డు గాలివానకు కూలిపోయింది. ఆ టైంలో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. తాత్కాలిక నిర్మాణాలతో ఇలాంటి ఘటనలు తిరిగి జరిగే అవకాశం ఉందని,  రూ.400 కోట్లతో శాశ్వత నిర్మాణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 41.57 ఎకరాల్లో షెడ్లు, 39.70 ఎకరాల్లో 681 కమీషన్ ఏజెంట్ల షాపులు, 19.71 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీలు, 45 ఎకరాల్లో రోడ్లు, 24.44 ఎకరాల్లో  పార్కింగ్ ఏర్పాటు చేయాలని అధికారులు ప్లాన్ ​చేశారు.  మాస్టర్ ప్లాన్ రెడీ చేసి గవర్నమెంట్ అప్రూవల్​కు పంపారు. ఆ తర్వాత మార్కెట్​నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అప్​డేట్ లేదు. ప్రస్తుతానికి ఫ్రూట్​ మార్కెట్ ​తాత్కాలికంగా బాటసింగారంలోని లాజిస్టిక్​పార్కులో కొనసాగుతోంది. అక్కడ సరైన సౌకర్యాలు లేక లైసెన్స్డ్ ఏజెంట్లు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అప్రూవల్ రాగానే డీపీఆర్​ రెడీ చేస్తం

మాస్టర్ ప్లాన్​ను ప్రభుత్వానికి పంపాం. అప్రూవల్​ వస్తే డీపీఆర్ రెడీ చేస్తాం. ఇంకో నెలరోజులు పట్టొచ్చు. డీపీఆర్​ను కూడా ఆమోదించిన వెంటనే పనులు మొదలు పెడతాం.
– లక్ష్మీబాయి, మార్కెట్ శాఖ డైరెక్టర్