చార్లెస్‌–3 రాజు పట్టాభిషేకంలో ‘కోహినూర్‌’

చార్లెస్‌–3 రాజు పట్టాభిషేకంలో ‘కోహినూర్‌’

లండన్‌: పట్టాభిషేక సంవత్సరానికి గుర్తుగా లండన్ టవర్‌లో కిరీట ఆభరణాల సరికొత్త ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే మే 6న చార్లెస్‌–3తోపాటు ఆయన భార్య కెమిల్లా పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఎలిజబెత్‌ రాణి అనంతరం చార్లెస్‌–3 రాజుగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే లండన్ టవర్‌‌‌లోని బ్రిటన్ రాజాభరణాల ప్రదర్శనలో కోహినూర్​ వజ్రం కనిపించనుంది. దీన్ని రాజ చిహ్నంగా పరిగణిస్తారు. హిస్టారిక్‌ రాయల్‌ ప్యాలెస్‌ (హెచ్‌ఆర్‌పీ)లో  మే 26 నుంచి బ్రిటన్​ ప్రజలు దీనిని తీలకించవచ్చు.  

ఆంధ్ర రాష్ట్రం కొల్లూరులో తొలిసారి ఇది దొరికిందని చరిత్రకారులు చెబుతారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్ పంపిన మాలిక్ కాఫుర్‌తో సంధి చేసుకొని అపారమైన సంపద, కోహినూర్‌ వజ్రాన్ని ఇచ్చాడని వారు చెబుతారు. ఇది కాలగమనంలో చివరకు బ్రిటిష్‌ పాలకుల వద్దకు చేరింది. ప్రస్తుతం లండన్‌ టవర్‌ వద్దనున్న జ్యువెల్‌ హౌస్‌లో ఉంది. ఈ వజ్రం తిరిగి ఇవ్వాలని భారత్‌ పలుమార్లు విజ్ఞప్తి చేసినా బ్రిటన్‌ తిరస్కరించింది.