గతానికి కంటే భిన్నంగా సెంచరీ సెలబ్రేషన్స్

గతానికి కంటే భిన్నంగా సెంచరీ సెలబ్రేషన్స్

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సెంచరీ చేశాడు. దాదాపు వెయ్యి 19 రోజుల సుధీర్ఘ విరామం తర్వాత కోహ్లీ శతక్కొట్టాడు. ఆసియాకప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 122 పరుగులు చేసి..అంతర్జాతీయ క్రికెట్లో 71వ సెంచరీని నమోదు చేశాడు. నవంబర్ 2019 నుండి ఇప్పటి వరకు కోహ్లీ సెంచరీ కొట్టలేదు. ఇక తాజా సెంచరీ కోహ్లీ టీ20 కెరీర్లో తొలి టీ20సెంచరీ కావడం విశేషం. సెంచరీ అనంతరం అభిమానులకు అభివాదం చేసిన కోహ్లీ ..తన మెడలోని  చైన్‌ను, అలాగే తన వివాహ ఉంగరాన్ని ముద్దుపెట్టుకున్నాడు.  ఈ సమయంలో కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు.

సెంచరీ తర్వాత షాక్ అయ్యా
కోహ్లీ ఇన్నింగ్స్ అనంతరం.. సంజయ్ మంజ్రేకర్‌ కోహ్లీని పలు ప్రశ్నలు అడగాడు. ఈ సందర్భంగా  రెండున్నరేళ్లలో తనకు ఎన్నెన్నో అనుభవాల ఎదురయ్యాయని... అవి చాలా నేర్పించాయని కోహ్లీ అన్నాడు. మరో నెలలో  34ఏళ్లు పడతాయన్నాడు. అయితే  ఎప్పుడూ ఆవేశంగా సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకునే తాను ఇప్పుడూ అలా వ్యవహరించొద్దని అనుకున్నట్లు చెప్పాడు. అందుకే ఈ సెంచరీ సెలబ్రేషన్స్ వేడుకలు గతానికంటే భిన్నంగా చేసుకున్నానని తెలిపాడు. సెంచరీ  చేసిన తర్వాత కాసేపు షాక్ అయ్యానన్నాడు.  టీ20ల్లో తాను సెంచరీ చేయలేదన్నాడు. ఈ ఇన్నింగ్స్ ఎన్నో విషయాల సమాహారమన్న కోహ్లీ...తనకు జట్టు బృందం ఓపెన్‌గా, సహాయకారిగా ఉందని కోహ్లీ చెప్పాడు.

సెంచరీ ఆమెకే అంకితం..
సెంచరీ చేసిన తర్వాత నా చైన్ నా చైన్, ఉంగరాన్ని ముద్దుపెట్టుకున్నాను. నేను ఇలా మీ ముందు మళ్లీ వచ్చానంటే దాని వెనకాల ఓ వ్యక్తి ఉంది. ఆమె నా వైఫ్ అనుష్క. ఈ కష్టకాలంలో ఆమె ఎన్నోసార్లు నాకు అండగా నిలిచింది. ఈ సెంచరీని అనుష్కతో పాటు..నా కూతురు వామికకు అంకితమిస్తున్నా. అనుష్క నిరంతరం నాలో ప్రోత్సహం నింపింది. ఆరు వారాల సెలవు తర్వాత నేను రిఫ్రెష్ అయ్యాను. ఈ విరామం నన్ను మళ్లీ ఆటను ఆస్వాదించడానికి ఉపయోగపడింది.'అని కోహ్లీ తెలిపాడు.

రికార్డులు బద్దలు..
71వ సెంచరీతో చెలరేగిన కోహ్లీ..పలు రికార్డులను కొల్లగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 71వ సెంచరీ బ్యాట్స్మన్గా కోహ్లీ పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా సెంచరీల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో కోహ్లీకి ఇది తొలి సెంచరీ కావడం విశేషం. అంతేకాదు..ఈ సెంచరీతో అంతర్జాతీయ కెరీర్లో 24 వేల పరుగుల మైలురాయికి విరాట్ చేరుకున్నాడు. క్రికెట్లో 24వేల రన్స్ చేసిన ఆరో బ్యాట్స్మన్గా చరిత్రకెక్కాడు. అటు టీమిండియా తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్మన్గా రికార్డుకెక్కాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో 100సిక్సులు పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్గా అంతర్జాతీయ కెరీర్లో కోహ్లీ 250 సిక్సులు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో 3500పరుగుల మైలురాయిని కోహ్లీ అందుకున్నాడు. అలాగే టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఆసియా కప్ 2022లో అత్యధిక పరుగులు  (276) చేసిన బ్యాట్స్మన్గా కొనసాగుతున్నాడు.