పాత ఫోన్లతో విరాట్ చిత్రపటం

పాత ఫోన్లతో విరాట్ చిత్రపటం

విరాట్‌కు ఊహించని బహుమతి

ఓ అభిమాని తనకు కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. పాత మొబైల్ ఫోన్లు మరియు వైర్లను ఉపయోగించి భారత కెప్టెన్ కోహ్లీ చిత్రపటాన్ని తయారుచేసి తన అభిమానాన్ని తెలియజేశాడు.

భారత్, శ్రీలంకల మధ్య జరిగే టీ20 మూడు మ్యాచుల సిరీస్‌లో తొలి మ్యాచ్ గౌహతిలోని బర్సాపారా క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్లు రెండు రోజుల ముందుగానే గౌహతిలోని ఓ హోటళ్లో దిగింది. కోహ్లీ అభిమాని రాహుల్ ఆ హోటల్‌కి వెళ్లి తాను తయారుచేసిన చిత్ర పటాన్ని కోహ్లీకి అందజేశాడు. అది అందుకున్న కెప్టెన్, ఆ చిత్ర పటంపై సంతకం చేశాడు. అంతేకాకుండా.. అభిమాని రాహుల్‌ని పొగుడుతూ.. ఇది చాలా అవుట్ స్టాండింగ్ పరఫార్మెన్స్ అని కోహ్లీ ఆ చిత్ర పటంపై రాశాడు.  ఈ మొత్తం ఎపిసోడ్‌ను బీసీసీఐ వీడియో తీసి తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది.

కోహ్లీ అభిమాని రాహుల్ మాట్లాడుతూ.. ఈ చిత్రపటాన్ని తయారుచేయడానికి తనకు మూడు రోజులు పగలు, మూడు రోజుల రాత్రిళ్లు పట్టిందని తెలిపాడు. పాత ఫోన్లతో ఇలాంటి చిత్రపటాలు తయారుచేసినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కి దరఖాస్తు చేసుకున్నాడు.

పాత ఫోన్‌లను ఉపయోగించి తయారుచేసిన విరాట్ ఫోటో అభిమానుల ప్రేమకు నిదర్శనమని బీసీసీఐ పేర్కొంది. 2020 కొత్త సంవత్సర ఆరంభంలో ఇండియా తన తొలి మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడనుంది. మూడు టీ20 సిరీస్‌లో తొలి టీ20 గౌహతిలోని బర్సాపారా క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 7 గంటలకు మొదలుకానుంది.