నా ప్రపంచం అంతమైందనుకున్నా: విరాట్‌‌కోహ్లీ

నా ప్రపంచం అంతమైందనుకున్నా: విరాట్‌‌కోహ్లీ
  • 2014 ఇంగ్లండ్‌‌ టూర్‌‌లో మానసికంగా ఇబ్బంది పడ్డా
  • ఏం చేయాలో, ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు
  • బ్రేక్‌‌ తీసుకొని మాక్స్​వెల్​ మంచి పని చేశాడు

ఇండోర్‌‌: మానసిక సమస్య వల్ల ఆట నుంచి బ్రేక్‌‌ తీసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌‌రౌండర్‌‌ గ్లెన్‌‌ మాక్స్‌‌వెల్‌‌కు టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌కోహ్లీ మద్దతు పలికాడు. మ్యాక్సీ సరైన నిర్ణయం తీసుకున్నాడని, మిగిలిన క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడని అన్నాడు. 2014 ఇంగ్లండ్‌‌ టూర్‌‌ అప్పుడు తన మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని చెప్పిన విరాట్‌‌.. ప్రపంచం అంతమైపోయింది అనేలా తన ఆలోచనలు ఉండేవని చెప్పాడు. అయితే ఈ విషయం బయటకు ఎలా చెప్పాలో తనకు తెలియలేదన్నాడు. కానీ మ్యాక్సీ తన పరిస్థితిని ధైర్యంగా బయటకు చెప్పడం గొప్ప విషయమని కోహ్లీ అన్నాడు. ‘గ్లెన్‌‌ చాలా మంచి పని చేశాడు. ఇలా సమస్యను బయటకు చెప్పగలిగే సామర్థ్యం  ఇంటర్నేషనల్‌‌ క్రికెటర్లందరిలోను రావాలి. 2014 ఇంగ్లండ్‌‌ టూర్‌‌ అప్పుడు నేను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా.  ప్రపంచం అంతం అయిపోతుందనే భావన కలిగినా నా పరిస్థితిని ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో తెలిసేదికాదు. రంగమేదైనా అందరూ మనసుపెట్టి తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. కానీ, ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో ఎవ్వరూ కనిపెట్టలేరు. తన పరిస్థితిని బయటకు చెప్పి మాక్స్‌‌వెల్‌‌      క్రికెటర్లందరికి ఉదాహరణగా నిలిచాడు. మైండ్‌‌సెట్‌‌ సరిగా లేనప్పుడు  ఒక్కోసారి ఎన్నిసార్లు ప్రయత్నించినా చివరికి ఏం చేయాలో తెలియని స్థితికి చేరుతాం. గ్లెన్‌‌ పరిస్థితి కూడా ఇదే. ఎవరు ఔనన్నా కాదన్నా ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మీరు మెంటల్‌‌గా సిద్ధంగా లేరా, ఆట నుంచి బ్రేక్‌‌ కావాలా అని నన్ను అడిగితే నేను సరైన సమాధానం చెప్పలేను. ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడుతుంటే అన్నీ వదిలేసుకోవాలని నేను చెప్పడం లేదు. కొంత విశ్రాంతి తీసుకుని, చేసేపనిపై క్లారిటీ తెచ్చుకోవాలి. ఈ టెన్షన్‌‌ నా వల్ల కాదు అని ఎవరైనా చెబితే వారి అభిప్రాయాన్ని  గౌరవించాలి. మైండ్‌‌సెట్‌‌ సరిగా లేదంటే దానిని చేతకానీతనంలా చూడకూడదు. నిత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందిగా భావించాలి’ అని అన్నాడు.

Kohli praised Maxwell for taking break from cricket due to mental health