ఆటకు దూరంగా ఉండటం పిచ్చెక్కిస్తుంది

ఆటకు దూరంగా ఉండటం పిచ్చెక్కిస్తుంది

సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసియా కప్లో ఆడబోతున్నాడు. పాక్ తో జరిగే మ్యాచ్లో కోహ్లీ బరిలోకి దిగబోతున్నాడు. అయితే నెల రోజుల తర్వాత బ్యాట్ పట్టబోతున్న కోహ్లీ.. భావోద్వేగానికి గురయ్యాడు. తన 14 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో నెల రోజుల పాటు బ్యాట్ పట్టకపోవడం ఇదే తొలిసారి అని కోహ్లీ చెప్పాడు. ఆటకు దూరంగా ఉండటం పిచ్చెక్కిస్తుందని, ఈ విషయంలో మానసికంగా తాను కుంగిపోయానన్నాడు. నెలరోజులు ఆటకు దూరంగా ఉన్నందుకు సిగ్గుగా లేదన్నాడు.

ప్రతీ బంతితో మేలు జరగాలని భావిస్తా..
తాను ఏ పని చేసినా వివేకంతో చేస్తానని విరాట్ కోహ్లీ చెప్పాడు. ఎల్లప్పుడూ అలాగే ఉండటానికి ఇష్టపడతానన్నాడు. మైదానంలోనూ దూకుడుగా ఉంటానని తెలిపాడు. అయితే అలా ఎలా సాధ్యమంటూ చాలా మంది ప్రశ్నిస్తారని..ఆటపై ప్రేమతోనే అని వారికి  సమాధానం చెప్పేవాడినన్నాడు. ఏ మ్యాచ్ ఆడినా..జట్టుకు మేలు జరగాలని భావిస్తానని కోహ్లీ అన్నాడు. అందుకే మైదానంలో రాణించేందుకు కృషి చేస్తానని తెలిపాడు. బయటి వ్యక్తులకు అది అసాధారణమే అయినా తనకు జట్టును గెలిపించుకోవడమే ముఖ్యమని విరాట్ తెలిపాడు.

కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నా..
10 ఏళ్లలో తాను నెల రోజుల పాటు బ్యాట్ పట్టకుండా ఉండటం ఇదే తొలిసారి అని కోహ్లీ అన్నాడు. కొన్ని రోజులుగా తన సామర్థ్యానికి తగినట్టుగా ఆడటం లేదని గ్రహించినట్లు చెప్పుకొచ్చాడు. అయితే  ప్రతీసారి నువ్వు చేయగలవు. పోరాడగలవు. ఆ సామర్థ్యం నీలో ఉంది అని నాకే నేను సర్ది చెప్పుకునేవాడినని వెల్లడించాడు. కానీ, తన శరీరం మాత్రం తాను ఆలోచించినట్టు లేదని, ఆగిపొమ్మని చెప్పిందన్నాడు. అందుకే కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని మనసు సూచించిందన్నాడు. పైకి తాను మానసికంగా ధృడంగా కనిపించినా.. ప్రతీ ఒక్కరికి పరిమితులు ఉంటాయని, వాటిని గుర్తించాలన్నాడు. లేదంటే పరిణామాలు ప్రమాదకరంగా మారవచ్చని..అందుకే రెస్ట్ తీసుకున్నా అని కోహ్లీ పేర్కొన్నాడు. 

ఫ్యామిలీతో గడిపిన కోహ్లీ
2019లో చివరి సెంచరీ చేసిన కోహ్లీ..ఆ తర్వాత ఫాం లేమితో తంటాలు పడ్డాడు. చివరకు కెప్టెన్సీ కోల్పోయాడు. ఆడపాదడపా మ్యాచులు ఆడినా పెద్దగా రాణించలేదు. దీంతో ఇంగ్లండ్‌ పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్‌ల్లోనూ కోహ్లీ ఆడలేదు. ఈ సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి కోహ్లీ ఫ్రాన్స్‌లో గడిపాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆసియాకప్ లో పాక్‌తో జరిగే మ్యాచ్‌తో రీఎంట్రీ ఇస్తున్నాడు.