
- తాండూరు వోగిపూర్లో చిక్కుకున్న పోలీస్ వెహికల్
- కాగ్నా నది ఉధృతికి 50 ఆవులు మృతి
వికారాబాద్, వెలుగు : రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా అతలాకుతమైంది. తాండూరు కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో యాలాల మండల పరిధిలో ఉన్న కోకట్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. కోటిపల్లి ప్రాజెక్టులోకి భారీగా నీళ్లు చేరడంతో 50 ఏండ్ల తర్వాత కోటపల్లి ఊరిలోకి వరద చేరింది.
గత రాత్రి హనుమాన్ టెంపుల్, బొడ్రాయి వరకు ప్రాజెక్టు నీరు రావడంతో గ్రామస్తులు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. తాండూరు మండలంలోని వీర్ శెట్టి పల్లికి ఇరువైపులా కాగ్నా నది ఉండడంతో నీటి ఉధృతి పెరిగి సమీపంలోరి బ్రిడ్జి పై నుంచి వర్షపు నీరు పొంగిపొర్లుతోంది. దీంతో వీర్శెట్టిపల్లి జలదిగ్బంధంలో చిక్కుకుంది.
చిక్కుకుపోయిన పోలీసు వాహనం
తాండూరు సమీపంలోని వోగిపూర్ నాపరాతి గనుల్లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు వెళ్లిన పోలీస్ వాహనం వరద నీటిలో చిక్కుకుంది. తాండూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వోగిపూర్ గనుల్లో కార్మికులు పని చేస్తుంటారు. భారీ వర్షానికి వారు గనుల్లోనే చిక్కుకుపోగా, పోలీసులు వాహనంలో కాపాడడానికి వెళ్లారు. అయితే, మధ్యలోనే భారీగా వరద వచ్చి వాహనాన్ని ముంచెత్తాయి. దీంతో మధ్యలోనే ఆగిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్డీఆర్ఎఫ్ టీమ్, గ్రామస్తులు తాళ్ల సాయంతో బయటకు తీసుకువచ్చారు.
ఇండ్లలోకి వరద నీరు
తాండూర్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలైన ఆదర్శనగర్ కాలనీ, గొల్ల చెరువు ప్రాంతంలో భారీగా వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది. తాండూర్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి లతో కలిసి కోకట్ నది బ్రిడ్జి , వీర్ శెట్టిపల్లి, గోనూరు తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కాగ్నా వరదలు చిక్కుకొని 50 ఆవులు మృతి
బషీరాబాద్ మండలంలోని క్యాద్గిరా, గంగ్వార్, నవద్గీ, జీవన్గి, ఇందర్ చెడ్ తదితర గ్రామాలకు ఆనుకొని కాగ్నా నది ప్రవహిస్తోంది. కర్నాటక గంగా నది, తాండూర్ కాగ్నా నది వాగులు కలవడంతో సరిహద్దు గ్రామాలు జలమయమయ్యాయి. దీంతో కాగ్నా, క్యాదిర్గా సరిహద్దులో ఉన్న గోశాల మునిగింది. 150కు పైగా ఆవులుండగా కొన్ని ఆవులు, కోడెలు తప్పించుకొని పొలాల్లో ఉన్న గట్టుపై చేరాయి. మరికొన్ని నదిలో ఈదుకుంటూ వాగు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు చేరుకున్నాయి.
సుమారు 50 వరకు ఆవులు వరద నీటిలో కొట్టుకుపోయి చనిపోయాయి. తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులతో కలిసి కాగ్నా నది సరిహద్దు ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. అధికారులకు అప్రమత్తం చేసి ఆవులను రక్షించే ప్రయత్నం చేశారు. డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి, తహసీల్దార్ షాహిదా బేగం పాల్గొన్నారు.
అధికారులు అలర్ట్‌గా ఉండాలి: స్పీకర్
వికారాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు అప్రమత్తంగా ఉండాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో శనివారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. మండలాల వారీగా స్పెషల్ అధికారులను నియమించి క్షేత్ర స్థాయిలో మానిటరింగ్ చేయాలన్నారు. ప్రజలు పొంగే వాగులు, కాలువల వద్దకు వెళ్లకూడదని, కరెంట్ తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయట ప్రయాణాలు చేయవద్దని కోరారు.
చేవెళ్లలో ఉప్పొంగిన ఈసీ, మూసీ
చేవెళ్ల: చేవెళ్ల నియోజకవర్గంలో పామెన వాగు ఉధృతికి పామెన, చన్వెల్లి, ఇక్కారెడ్డిగూడ, ఆలూర్ వాగు ధాటికి ఆలూర్, తల్లారం, దుద్దాగు, తంగడపల్లి, అంతప్పగూడ గ్రామాలతోపాటు శంకరపల్లి మండలానికి రాకపోకలు స్తంభించాయి. చేవెళ్ల మండలం రేగడి ఘనపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, ఓ రన్నింగ్ బైక్ కొట్టుకుపోయింది.
దానిపై ఉన్న వ్యక్తి వాగుదాటి తప్పించుకున్నాడు. మరోవైపు ఈసీ, మూసీ నదులు ఉగ్రరూపం దాల్చాయి. నాగర్ గూడ వద్ద హైలెవల్ బ్రిడ్జిని తాకుతూ ఈసీ ప్రవాహం కొనసాగింది. శంకర్‌పల్లిలోని ఫత్తేపూర్‌లో వద్ద మూసీ ఉధృతంగా ప్రవహించడంతో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకర్‌పల్లిలో మూసీ ఉధృతిని పరిశీలించారు. భారీగా పంటనష్టం సంభవించింది.