
కోల్‌కతా: ఒలింపిక్స్ హాకీ కాంస్య పతక విజేత, ప్రముఖ స్పోర్ట్స్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ వేస్ పేస్‌కు కోల్‌కతాలో కన్నీటి వీడ్కోలు పలికారు. ఆదివారం జరిగిన ఆయన అంత్యక్రియలకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, హాకీ ఇండియా ప్రెసిడెంట్ దిలీప్ టిర్కీతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. వేస్ శవపేటికను బెంగాల్ హాకీ క్లబ్‌లోకి తీసుకువస్తున్నప్పుడు అక్కడి యువ ప్లేయర్లు గార్డ్ ఆఫ్ హానర్‌తో నివాళులు అర్పించారు.
తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్‌కు గంగూలీ ధైర్యం చెప్పాడు. మాజీ క్రికెటర్ అరుణ్ లాల్, బెంగాల్ మినిస్టర్ సుజిత్ బోస్ కూడా ఓదార్చారు. మిడిల్‌టన్ రోడ్‌లోని సెయింట్ థామస్ చర్చ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. 1972 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ఇండియా హాకీ జట్టులో సభ్యుడైన వేస్ పేస్ రగ్బీ ప్లేయర్‌గా, స్పోర్ట్స్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్‌గా క్రీడా రంగానికి విశేష కృషి చేశారు.