న్యూఢిల్లీ: ఆసీస్ మాజీ స్టార్ క్రికెటర్ షేన్ వాట్సన్ కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేకేఆర్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం షేన్ వాట్సన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించుకున్నట్లు ప్రకటించింది. కేకేఆర్ హెడ్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి వాట్సన్ పనిచేయనున్నాడు. వాట్సన్‌కు ఐపీఎల్లో కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రికీ పాంటింగ్‌తో కలిసి వాట్సన్ కోచ్‌గా పని చేశాడు.
మూడు సంవత్సరాల విరామం తర్వాత తిరిగి కోచింగ్‌లోకి మళ్లీ అడుగుపెట్టనున్నాడు ఆసీస్ మాజీ ఆల్ రౌండర్. కేకేఆర్ ఇప్పటికే మూడుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. లాస్ట్ సీజన్ లో మాత్రం కేకేఆర్ దారుణమైన ఫెర్మామెన్స్ కనబరిచింది. కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో వచ్చే సీజన్లో ఘనమైన పునరాగమనం కోసం డైనమిక్ కోచింగ్ సిబ్బందితో లీగ్‌లో సత్తా చాటాలని ఎదురుచూస్తోంది.
కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా నియామకం కావడంపై వాట్సన్ సంతోషం వ్యక్తం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ లాంటి ఐకానిక్ ఫ్రాంచైజీలో భాగం కావడం గొప్ప గౌరవమని అన్నారు. కేకేఆర్ అభిమానుల అభిరుచిని, జట్టు శ్రేష్ఠత పట్ల నిబద్ధతను నేను ఎల్లప్పుడూ ఆరాధిస్తానని అన్నారు. కోల్‌కతాకు మరో టైటిల్‌ను తీసుకురావడానికి కోచింగ్ గ్రూప్, ఆటగాళ్లతో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
వాట్సన్ క్రికెట్ కెరీర్:
షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా తరఫున 190 వన్డేలు, 59 టెస్టులు, 58 టీ20లు ఆడాడు. ఆల్ రౌండర్‌గా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించి ఆస్ట్రేలియా తరఫున ఆల్ టైమ్ గ్రేట్స్‌లో ఒకరిగా పేరు సంపాదించకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కూడా వాట్సన్ ఘనమైన రికార్డ్ కలిగి ఉన్నాడు. 2007-2015 వరకు రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన వాట్సన్.. 2016, 2017లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. 2018 చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరి 2021 వరకు ఆ ఫ్రాంచైజ్ తరుఫునే ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు వాట్సన్.
►ALSO READ | టీమిండియా -19లోకి మరో హైదరాబాదీ
