KKR vs SRH: క్లాసన్ వీరోచిత పోరాటం వృధా.. గెలిచే మ్యాచ్ ఓడిన సన్ రైజర్స్

KKR vs SRH: క్లాసన్ వీరోచిత పోరాటం వృధా.. గెలిచే మ్యాచ్ ఓడిన సన్ రైజర్స్

ఆహా ఏం మ్యాచ్.. గెలుపోటముల సంగతి పక్కన పెడితే సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య నేడు (మార్చి 23) జరిగిన మ్యాచ్   అసలైన టీ20 మజా అందించింది. మ్యాచ్ నాటకీయ మలుపులు తిరుగుతూ చివరి బంతివరకు గెలుపు నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓడిపోతున్న మ్యాచ్ ను క్లాసన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్ ను రసవత్తరంగా మార్చేశాడు. 

29 బంతుల్లో 8 సిక్సర్లతో 63 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. క్లాసన్ కు తోడు షాబాజ్ అహ్మద్ చివర్లో మెరుపులు మెరిపించడంతో మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సిన దశలో తొలి బంతికి క్లాసన్ సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ సన్ రైజర్స్ దే అనుకున్నారు. అయితే కేకేఆర్ బౌలర్ హర్షిత్ రానా ఒత్తిడిని తట్టుకొని అద్భుతంగా బౌలింగ్ చేసి కేకేఆర్ కు నాలుగు పరుగుల విజయాన్ని అందించాడు. 

ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ ,అభిషేక్ శర్మ పవర్ ప్లే లో దూకుడుగా ఆడి తొలి వికెట్ కు 5.3 ఓవర్లలోనే 60 పరుగులు జోడించి మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఆ తర్వాత వచ్చిన త్రిపాఠి, మార్కరం బ్యాట్ ఝళిపించడంలో విఫలమయ్యారు. దీంతో మధ్య ఓవర్లలో స్కోర్ వేగం నెమ్మదించింది. చివర్లో క్లాసన్ సిక్సర్లతో హోరెత్తించినా.. ఫలితం లేకుండా పోయింది. చివరి నాలుగు ఓవర్లలో 76 పరుగులు చేయాల్సిన దశలో ఏకంగా 71 పరుగులు బాదేయడం విశేషం.    

మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆండ్రీ రస్సెల్ వీర ఉతుకుడుకు తోడు సాల్ట్ హాఫ్ సెంచరీ.. రమణ్ దీప్, రింకూ సింగ్ మెరుపులతో కేకేఆర్ భారీ స్కోర్ చేయగలిగింది. రస్సెల్ తన విధ్వంసంతో 25 బంతుల్లోనే 7 సిక్సులు, 3 ఫోర్లతో  64 పరుగులు చేసి స్కోర్ కార్డు ను 200 పరుగులకు చేర్చాడు. మరో ఎండ్ లో రింకూ సింగ్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి చక్కని సహకారం అందించాడు. కేకేఆర్ చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 85 పరుగులు రాబట్టింది.