దుర్గా పూజకు అరుదైన గుర్తింపు

దుర్గా పూజకు అరుదైన గుర్తింపు

మనదేశంలో ప్రతీ పండగకి, ప్రతీ వేడుకకు, ప్రతీ పూజకు ఓ ప్రత్యేకత, ప్రాధాన్యత ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఒకే పండగను వారి వారి ఆచారాల ప్రకారం ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే దసరా ఉత్సవాల్లో.. దుర్గా మాత పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక బెంగాల్ లో దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. కోల్ కతా దుర్గా పూజకు ఎంతో ప్రాధాన్యత ఉంది.  అందుకే ఇప్పుడు బెంగాల్ దుర్గా పూజకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. ఆ పూజ ఇప్పుడు యునెస్కో జాబితాలో చేరింది. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) కోల్‌కతా దుర్గా పూజను మానవత్వ సంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చినట్లు ప్రకటించింది. దీంతో బెంగాల్ ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. బెంగాల్‌లో దుర్గాపూజను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. దుర్గాపూజ బెంగాల్ సంస్కృతిలో ఒక భాగం. దుర్గాపూజకు వారసత్వ హోదా ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వం యునెస్కోను అభ్యర్థించింది. దుర్గాపూజ అధికారికంగా యునెస్కో గుర్తింపు పొందింది. 2021 డిసెంబర్ 13 నుండి 18 వరకు ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌లో జరగనున్న ఇంటర్‌గవర్నమెంటల్ కమిటీ 16వ సెషన్‌లో కోల్‌కతాలోని దుర్గా పూజ UNESCO సాంస్కృతిక వారసత్వ ప్రతినిధుల జాబితాలో చేర్చింది. 

మరోవైపు ఈ విషయంపై ప్రధాని మోడీ స్పందించారు. యునెస్కో జాబితాలో దుర్గా పూజ చేరడంపై మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతీయులకు ఎంతో గర్వకారణం, సంతోషం కలిగించే విషయమని ఆయన ట్వీట్ చేశారు. దుర్గాపూజ మన ఉత్తమ సంప్రదాయాలు, జానపద కథలకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. కోల్‌కతా దుర్గాపూజ అనేది ప్రతి ఒక్కరికీ అనుభవంలో ఉన్న విషయమన్నారు.

మరోవైపు బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు. ఇది బెంగాల్ ప్రజలు గర్వపడాల్సిన సమయం అన్నారు. ‘దుర్గా పూజ పండగ కంటే చాలా ఎక్కువ. ఇది అందర్నీ కలిపే ఓ భావోద్వేగం. ఇప్పుడు, దుర్గాపూజ మానవత్వం యొక్క అసంకల్పిత సాంస్కృతిక వారసత్వం అనే జాబితాలో చేర్చబడింది.మేమంతా ఆనందంలో మునిగితేలుతున్నాం ’. అని మమత తన ట్వీట్ లో పేర్కొన్నారు.