ప్రేమిస్తున్నాను అంటూ నమ్మించి.. పెళ్లి పేరుతో కాలయాపన చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కొల్లూరు పోలీస్ స్టేషన్ ఎస్సై సురేష్ కుమార్ ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా పని చేస్తున్న యువతిని.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమ పేరుతో మోసం చేసినట్లు కేసు నమోదు కావటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు. పూర్తి వివరాల్లోకి వెళితే..
2018 బ్యాచ్ ఎస్సై సురేష్ కుమార్.. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న యువతితో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పటంతో.. ఎస్సై సురేష్ కు దగ్గరైంది ఆ మహిళా కానిస్టేబుల్. కొన్నాళ్లుగా పెళ్లి విషయంపై ఒత్తిడి చేస్తుంది మహిళా కానిస్టేబుల్. సాకులు చెబుతూ.. పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు ఎస్సై సురేష్ కుమార్. పెళ్లి వాయిదాపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వెంటనే పెళ్లి చేసుకోవాలని మహిళా కానిస్టేబుల్ పట్టుబట్టింది.
పెళ్లి విషయంలో ఎస్సై సురేష్ కుమార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటంతో.. మహిళా కానిస్టేబుల్ గట్టిగా నిలదీసింది. పెళ్లి చేసుకునేది లేదని.. పెళ్లి చేసుకోవటం కుదరదు అని తేల్చి చెప్పారు ఎస్సై సురేష్. ఈ క్రమంలోనే ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసినట్లు కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసింది మహిళా కానిస్టేబుల్.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎస్సై సురేష్ ను విచారించేందుకు ప్రయత్నించారు. అతని సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ లో ఉండటంతో.. విచారణకు స్పందించకపోవటం.. అందుబాటులో లేకపోవటం వంటి కారణాలతో.. ఎస్సై సురేష్ కుమార్ ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. బాధితురాలు మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఆధారాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
