ప్రధాని మోదీ పొదుపు మంత్రం : రెండు సెక్యూరిటీ కార్లతోనే కాన్వాయ్

ప్రధాని మోదీ పొదుపు మంత్రం : రెండు సెక్యూరిటీ కార్లతోనే కాన్వాయ్

ప్రధాని మోదీ చెప్పినట్లుగానే చేస్తున్నారు. తన భద్రతా కాన్వాయ్  కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.  తన భద్రతా కాన్వాయ్ లో వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. ఇంధనం పొదుపుకోసం తన కాన్వాయ్ లో 50 శాతం వాహనాలను తగ్గించాలని ఆదేశించిన కొద్దిగంటల్లో అమలు చేస్తున్నారు. కేవలం రెండు కార్ల కాన్వాయ్ తో ప్రయాణం చేస్తున్నారు. ప్రధాని మోదీ కాన్వాయ్‌లో కేవలం రెండు వాహనాలు మాత్రమే కనిపించడం చర్చనీయాంశమైంది.ఢిల్లీ వీధుల్లో  ప్రధాని మోదీ కాన్వాయ్ దృష్యాలు కనిపించాయి. వీటికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని.. ఏడాది పాటు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని బుధవారం (మే13) ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇంధన వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా.. తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ప్రధానికి భద్రతగా ఉండే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG)లోని కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) సంఖ్యను పెంచాలని ప్రధాన మంత్రి సూచించారు. ఇందు కోసం కొత్త వాహనాలను కొనొద్దని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఎంపీ సీఎం మోహన్ యాదవ్‌లతో సహా ఇతర మంత్రులు కూడా తమ అధికారిక కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు. అనవసర ప్రయాణాలను తగ్గించాలని, జాతీయ వనరులను పరిరక్షించాలని ప్రధాని ఇటీవల పిలుపునిచ్చిన క్రమంలో బాధ్యతాయుతమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం, పరిపాలనాపరమైన పొదుపు చర్యలు చేపట్టడం వంటి విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యను పరిగణిస్తున్నారు.