- డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపుపై స్పెషల్ డ్రైవ్
- ఆదిలాబాద్ లో మంజూరు పత్రాల పంపిణీ: మంత్రి పొంగులేటి
- ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష
- పాల్గొన్న స్పీకర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఆదిలాబాద్ లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.ఇండ్ల పంపిణీపై గైడ్‌లైన్స్‌ను ఈ నెల 21న జరిగే కేబినెట్ మీటింగ్‌లో ఖరారు చేస్తామన్నారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై మంగళవారం హిమాయత్ నగర్ హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీస్ లో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో మంత్రి పొంగులేటి రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అక్బరుద్దీన్ ఒవైసీ, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హైదరాబాద్ కు దూరంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించడం వల్ల ఉపయోగం లేకుండా పోయాయన్నారు. అటువంటి తప్పు పునరావృతం కాకుండా పేదలు ఇప్పుడు నివాసం ఉండే ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇండ్లను నిర్మించేలా నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని స్థలాలను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. ఈ నెల చివరిలోగా హైదరాబాద్ లో ఇండ్ల స్థలాలున్న వారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు.
- అంగుళం అన్యాక్రాంతమైనా సహించేది లేదు
అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో యూఎల్సీ భూములు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, రూల్స్ కు విరుద్ధంగా కొంత భాగాన్ని రిజిస్ట్రేషన్ చేశారని, స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమావేశంలో మంత్రి దృష్టికి తీసుకుని రాగా వెంటనే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
పేదరికమే అర్హతగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఉండాలని రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జిల్లా కలెక్టర్, హౌసింగ్ ఎండీలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి రూట్ మ్యాప్ తయారు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.
ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో క్షేత్ర స్థాయిలో నియోజకవర్గాల వారీగా పర్యటించి గుర్తించాలన్నారు. గతంలో నిర్మించిన ఇండ్లకు రిపేర్ వర్క్‌లను నియోజకవర్గాల వారీగా లెక్కతీయాలన్నారు. డబుల్ ఇండ్లు తీసుకుని అందులో ఉండని వారికి నోటీసులు ఇచ్చామని గుర్తు చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. శాసనసభలో తీసుకున్న నిర్ణయం మేరకు సమావేశాలు నిర్వహించడంపై మంత్రిని అభినందించారు.
- ఆ ఇండ్లపై స్పెషల్ డ్రైవ్
డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించడంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన వాటికి, వివిధ నిర్మాణ దశల్లో ఉన్న వాటికి ఈ నెలాఖరు కల్లా లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఆ కాలనీలకు 5 నుంచి 8 కిలోమీటర్లలోపు ఉన్న వారినే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణాలన్నీ పూర్తైన ఇండ్లలో లబ్ధిదారులు ఉండేలా పర్యవేక్షించాలన్నారు. ఈ కాలనీల్లో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.
