పుచ్చకాయపై ఏంటీ చావు వార్తలు.. ఛత్తీస్ ఘడ్ లో పుచ్చకాయ తిని 15 ఏళ్ళ పిల్లాడు మృతి..!

పుచ్చకాయపై ఏంటీ చావు వార్తలు.. ఛత్తీస్ ఘడ్ లో పుచ్చకాయ తిని 15 ఏళ్ళ పిల్లాడు మృతి..!

పుచ్చకాయ... ఎండాకాలంలో పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటుంటాం. బరువు తగ్గాలనుకునేవారు కూడా పుచ్చకాయ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. పుచ్చకాయలో ఉండే పోషకాలు అనేకం...అయితే, ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే  పుచ్చకాయ హానికరమా అన్న భయాందోళన కలుగుతోంది. మొన్న ముంబైలో ఒక ఫ్యామిలీ పుచ్చకాయ తిని చనిపోయారంటూ వార్తలు కలకలం రేపాయి.. అయితే, వారి చావుకు కారణం ఎలుకల మందు అని.. పుచ్చకాయ కాదని తేలింది. ఇప్పుడు ఛత్తీస్ ఘడ్ లో పుచకత తిని ముగ్గురు పిల్లలు చనిపోయారంటూ వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలోని ఒక గ్రామంలో 15 ఏళ్ళ బాలుడు పుచ్చకాయ తిని మరణించగా, మరో ముగ్గురు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. పోడి దల్హా గ్రామానికి చెందిన 15 ఏళ్ళ అఖిలేష్ ధివర్, అవారిడ్ గ్రామానికి చెందిన శ్రీ ధివర్, ఖోటాలకు చెందిన పింటూ ధివర్, కోట్ ఘర్ కు చెందిన హితేష్ ధివర్ లు తమ బంధువులతో కలిసి ఘుర్ఖోట్ లోని మేనమామ ఇంటికి వెళ్లి.. అక్కడ పుచ్చకాయ తిన్నారని... ఆ తర్వాత అఖిలేష్ మృతి చెందగా.. మిగతా పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు బంధువులు. 

మే 10న పిల్లలు పుచ్చకాయ తిన్నారని.. ఆ తర్వాత కొన్ని గంటలకే అఖిలేష్ కు వాంతులు, విరేచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయని.. ఆ తర్వాత కొద్దిసేపటికే మిగతా పిల్లల్లో కూడా ఇలాంటి లక్షణాలే కనిపించాయని అంటున్నారు బంధువులు.పిల్లలను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అఖిలేష్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారని అంటున్నారు. మిగతా పిల్లలను ఎమర్జెన్సీ వార్డ్ కు తరలించారని తెలిపారు బంధువులు.

పుచ్చకాయను ఉదయం కోసి, కొన్ని గంటల తర్వాత తిన్నారని, అందువల్ల అది కలుషితమయ్యే అవకాశం ఉందని అంటున్నారు డాక్టర్లు. కలుషితమైన పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కు గురై బాలుడు మృతి చెందినట్లు ప్రాధమికంగా నిర్దారించినట్లు తెలిపారు పోలీసులు. 

బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని.. ఫోరెన్సిక్ టెస్ట్ కోసం అవయవాల శాంపిల్స్ ను భద్రపరిచామని తెలిపారు అధికారులు. ఇంట్లో ఉన్న మరో పుచ్చకాయను కూడా ల్యాబ్ టెస్ట్ కోసం పంపించామని తెలిపారు అధికారులు.ఫోరెన్సిక్ రిపోర్ట్స్, ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాక పిల్లాడి మరణానికి గల కారణం తెలుస్తుందని అన్నారు అధికారులు.