- ప్రకటించిన ఆ పార్టీ సీనియర్ నేతలు వేలుమణి, షణ్ముగం
- షణ్ముగం నివాసంలో ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం విజయ్
- ఒక్క ఓటుతో గెలిచిన ఎమ్మెల్యేను విశ్వాస పరీక్షలో పాల్గొనొద్దన్న హైకోర్టు
- నేడు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్.. 152కు చేరిన టీవీకే బలం
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం జరగనున్న కీలకమైన విశ్వాస పరీక్షకు ముందు సీఎం విజయ్ కి మద్దతు వెల్లువెత్తుతోంది. అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేల బృందం మంగళవారం విజయ్ ప్రభుత్వానికి తమ మద్దతును ప్రకటించింది. దీంతో విజయ్ సర్కారు సంఖ్యాబలం 152 కు చేరింది.
అన్నాడీఎంకే పార్టీ చీలిక వర్గం మద్దతు ప్రకటించిన కొన్ని గంటల తర్వాత సీఎం విజయ్.. షణ్ముగం నివాసానికి వెళ్లి తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఏప్రిల్ 23న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే మొత్తం 164 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 47 స్థానాల్లోనే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం ఆ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వాన్ని ప్రశ్నించింది. అప్పటి నుంచే పార్టీ నాయకత్వంపై వ్యతిరేకత మొదలైంది.
స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళనిస్వామి భావిస్తున్నారని సీవీ షణ్ముగం సంచలన ఆరోపణలు చేశారు. డీఎంకేను వ్యతిరేకించడానికి పుట్టిన పార్టీ, ఆ పార్టీతోనే చేతులు కలపడం సిద్ధాంతాలకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ ‘అమ్మ (జయలలిత) పాలన’ రావాలంటే విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇవ్వడమే సరైన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ‘మేము ప్రజల తీర్పును అంగీకరిస్తున్నాము. విజయ్ ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల తీర్పు. మేము సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము’ అని షణ్ముగం అన్నారు.
మంత్రి పదవుల కోసమే డ్రామాలు..
తిరుగుబాటు ఎమ్మెల్యేల ఆరోపణలను అన్నాడీఎంకే నాయకత్వం కొట్టిపారేసింది. తమ సొంత జిల్లాల్లో విజయం సాధించలేకపోయిన నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. టీవీకే ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం వేలుమణి, షణ్ముగం, విజయభాస్కర్ ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించింది.
పార్టీలోని కొద్దిమంది ఎమ్మెల్యేలు పొత్తు నిర్ణయాలు తీసుకోలేరని, పార్టీ కార్యకర్తల మద్దతు పళనిస్వామికే ఉందని ఆ పార్టీ స్పష్టం చేసింది. మరోవైపు, పళనిస్వామితో పొత్తు చర్చలు జరిగాయన్న వార్తలను డీఎంకే కూడా తోసిపుచ్చింది. తమ పార్టీలో చీలిక తెచ్చేందుకే షణ్ముగం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంది.
ఆ ఎమ్మెల్యే విశ్వాస పరీక్షలో పాల్గొనొద్దు: హైకోర్టు
ఒక్క ఓటుతో గెలుపొందిన టీవీకే ఎమ్మెల్యే ఆర్. శ్రీనివాస సేతుపతి బుధవారం విశ్వాస పరీక్షలో పాల్గొనొద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. తిరుపత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి ఆర్. శ్రీనివాస సేతుపతి.. డీఎంకేకు చెందిన కేఆర్ పెరియకరుప్పన్‌పై ఒక్క ఓటుతో గెలుపొందారు. సేతుపతికి 83,365 ఓట్లు రాగా.. పెరియకరుప్పన్‌కు 83,364 ఓట్లు పోలయ్యాయి.
దీంతో డీఎంకే నేత హైకోర్టును ఆశ్రయించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో లోపాలు జరిగాయని, మళ్లీ రీకౌంటింగ్ నిర్వహించాలని.. అప్పటివరకు సేతుపతి ప్రమాణ స్వీకారం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో కోర్టు సేతుపతి ప్రమాణ స్వీకారం చేయొద్దని, బుధవారం జరగనున్న విశ్వాస పరీక్షలోనూ పాల్గొనొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా, సేతుపతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై బుధవారం విచారణ జరగనుంది.
ఏఎంఎంకే ఎమ్మెల్యేపై వేటు
సీఎం విజయ్ టీవీకే పార్టీకి అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఎస్. కామరాజ్ తన మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్.. ఎమ్మెల్యే కామరాజ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి అతన్ని తొలగించినట్టు వెల్లడించారు.
