- భీంకు ఆదివాసీల పూజలు
ఖానాపూర్, వెలుగు: కుమ్రం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. పట్టణ శివారులోని కుమ్రం భీం చౌరస్తాలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భీం వర్ధంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహిం చారు. ఆదివాసీలతో కలిసి ఎమ్మెల్యే సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి నివాళి అర్పిం చారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆదివాసీ హక్కుల కోసం కుమ్రం భీం చేసిన పోరాటాలు, త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.
ఖానాపూర్ పట్టణ శివారులో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం కాలనీకి కుమ్రం భీం పేరు పెట్టాలని, ఇందుకోసం మున్సిపల్ పాలకవర్గం సమావేశంలో ప్రత్యేక తీర్మానం చేయాలని అక్కడున్న మున్సిపల్ చైర్మన్ చిన్నం సత్యం, అధికారులకు ఆదేశించారు. వచ్చే వర్ధంతి నాటికి ఇదే స్థలంలో భీం విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు అంకుష్ రావు, సీపీఎంఎల్ మాస్ లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.