రాష్ట్రంలో మైనింగ్​ స్కాం జరుగబోతుంది

రాష్ట్రంలో మైనింగ్​ స్కాం జరుగబోతుంది

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పెద్ద ఎత్తున మైనింగ్ కుంభకోణం జరుగబోతున్నదని ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్​రెడ్డి ఫిర్యాదు చేశారు.  సింగరేణికి అలాట్ చేసిన మైన్​తో రూ.50 వేల కోట్ల స్కాం జరగబోతున్నదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి విషయంలో కోల్ ఇండియా గైడ్ లైన్స్​ను పక్కన పెట్టి కేసీఆర్ కుటుంబ సభ్యులకు మైన్ టెండర్ అప్పగించే ప్రయత్నం నడుస్తున్నదని ఆరోపించారు. సోమవారం పార్లమెంట్​లో మోడీని కలిసి, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తర్వాత కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆధారాలతో ప్రధానికి వెల్లడించానన్నారు. తెలంగాణలో ఏయే రంగాల్లో అవినీతి జరుగుతున్నదో, సమస్యలు ఏమిటో ప్రధాని అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ‘నమామి గంగ’ తరహాలో మూసినది ప్రక్షాళన చేయాలని కోరానన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ  హైవే 6 లైన్ ఏప్రిల్​లో ప్రారభించాల్సి ఉండగా... జీఎంఆర్ సంస్థ ఆర్బిట్రేషన్ కు వెళ్లి మొండిగా వ్యవహరిస్తోందని చెప్పారు. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లానని, జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరినట్లు తెలిపారు. నల్గొండ – మల్లెపల్లి, భువనగిరి – చిట్యాల రోడ్డు గురించి ప్రధానితో చర్చించానని చెప్పారు. వీటిపై మోడీ సానుకూలంగా స్పందించారన్నారు.