
మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ పని అయిపోయినట్లే అని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అవినీతి సొమ్ముతో మునుగోడులో ఓట్లను కేసీఆర్ కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక ధర్మం కోసం వచ్చాయని చెప్పారు. కేసీఆర్ పంచే అవినీతి సొమ్ము తీసుకుని..ప్రజలు ధర్మం వైపు ఉండాలని కోరారు. మునుగోడు ప్రజలు తప్పుచేయరని..న్యాయం వాళ్లకు తెలుసున్నారు. గెలిచేది గెలిపించేది మునుగోడు ప్రజలే అని చెప్పారు. మునుగోడులో బీజేపీ క్యాంపు కార్యాలయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ప్రారంభించారు.
రాజీనామా చేయడానికి కారణం..
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి బలమైన కారణం ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనను గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక.. మునుగోడుపై ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రాజీనామా చేశానని చెప్పారు. తాను రాజీనామా చేసిన తర్వాతనే కేసీఆర్ సర్కారు దిగొచ్చి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. వేల మంది ప్రజలు కాషాయ కండువా కప్పుకోవడానికి వస్తున్నారని తెలిపారు.
మునుగోడు ప్రజలకు బ్రహ్మాస్త్రం
తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆర్ జాతీయ పార్టీ పెడతాడంట అని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని..ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తున్నాడని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిల వైపు ప్రపంచం మొత్తం చూస్తుందన్నారు. తన రాజీనామా మునుగోడు ప్రజలకు బ్రహ్మాస్త్రం అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి..కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా బొందపెట్టాలని పిలుపునిచ్చారు.