హరీశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడైతేనే.. ఆ పార్టీ నిలబడుతది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

హరీశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడైతేనే.. ఆ పార్టీ నిలబడుతది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాజకీయ వారసుడు మాజీ మంత్రి హరీశ్ రావు మాత్రమేనని కాంగ్రెస్​ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్​చాట్ చేశారు. బీఆర్ఎస్ కు హరీశ్ రావు ​అధ్యక్షుడు అయితేనే ఆ పార్టీ కొంతైనా నిలబడుతుందని తెలిపారు.

బీఆర్ఎస్ ను నడపడం కేటీఆర్ వల్ల కాదన్నారు.  ఆయన బీఆర్ఎస్ అధ్యక్షుడు అయితే పార్టీ‌లో ఒక్కరు కూడా ఉండరని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేటీఆర్ హైటెక్ పొలిటీషియన్ అని ఎద్దేవా చేశారు.  ప్రస్తుతం బీఆర్ఎస్ కొన ఊపిరితో ఉన్నదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పేరు మార్చుకుంటే మంచిదని సూచించారు. ఐదేండ్లు తమ ప్రభుత్వానికి ఢోకా లేదని పేర్కొన్నారు. 

అవినీతి మరకలేనోళ్లనే చేర్చుకుంటం

అవినీతి మరక లేని నేతలను మాత్రమే కాంగ్రెస్‌లోకి తీసుకుంటామని  రాజగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు. కొందరు నేతలు కాంగ్రెస్ కండువాలు జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారని చెప్పారు. డబ్బున్న నేతలు పార్టీలోకి వస్తే ఎలా వాడుకోవాలో తమకు తెలుసుని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్లు రావొచ్చని, పదవులు మాత్రం ఇవ్వబోమన్నారు. ప్రభుత్వం పోవడానికి చిన్న ఇన్సిడెంట్ చాలని..రాబోయే రోజులు ఎలా ఉంటాయో తెలియదు గాని, ఇప్పుడు అయితే తమ సర్కారుకు ఎటువంటి ఢోకా లేదని, ఐదేళ్లు ఉంటామని వివరించారు. కేబినెట్ విస్తరణపై తనకు సమాచారం లేదన్నారు. 

నల్గొండలో బీఆర్ఎస్ సభ ప్రభావం లేదు

నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ సభ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో పడదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. భువనగిరి ఎంపీ టికెట్ బీసీకి ఇచ్చినా తాము దగ్గర ఉండి గెలిపిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డికి చాన్స్ లేదని, వచ్చినా ఆయనకు మల్కాజ్ గిరి టికెట్ ఇవ్వమని చెప్పారు. ప్రజాస్వామ్యం గురించి బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో తాము 12 నుంచి 14 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీ ఐదేళ్ల పాటూ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఈసారి ఎన్నికలు టఫ్ గా ఉంటాయని, షర్మిల ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు.