రేవంత్​ పీసీసీ చీఫ్​ అయ్యాక బెదిరించి పైసలు వసూలు చేస్తున్నడు

రేవంత్​ పీసీసీ చీఫ్​ అయ్యాక బెదిరించి పైసలు వసూలు చేస్తున్నడు
  •  రేవంత్ వెనుక చంద్రబాబు, సీమాంధ్రులు 
  • 20 ఏండ్లు కాంగ్రెస్​ను తిట్టి, సోనియాను బలిదేవత అన్లేదా?
  • రేవంత్ ఓ చిల్లర దొంగ 
  • రేవంత్​ ఓ బ్లాక్​మెయిలర్​ 
  • మునుగోడులో కాంగ్రెస్​కు డిపాజిట్ కూడా రాదు

హైదరాబాద్​, వెలుగు :  పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి బ్లాక్ మెయిలర్​ అని, ఇరవై ఏండ్లు  కాంగ్రెస్​ పార్టీని తిట్టిన వ్యక్తి.. సీఎం అయ్యి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ​గోపాల్ రెడ్డి అన్నారు. రేవంత్​ పీసీసీ చీఫ్​ అయ్యాక అందరినీ బ్లాక్​మెయిల్​ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆయన వెనుక చంద్రబాబు, సీమాంధ్రులు ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం రాజగోపాల్ తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్​కు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఖతం అయ్యిందని రేవంత్​ కాంగ్రెస్​లోకి వచ్చారని, పైసలు పెట్టి పీసీసీ ​ పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. ‘‘నేను బాజాప్తా రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్తున్నా. రేవంత్​ మాత్రం పార్టీ మారినపుడు దొంగదారులు వెదుక్కున్నడు. స్పీకర్​కు ఇవ్వాల్సిన రాజీనామాను చంద్రబాబుకు ఇచ్చిండు. రేవంత్​ ఓ చిల్లర దొంగ, చరిత్రహీనుడు. ఆయన అసలు జైలుకు ఎందుకు పోయిండో చెప్పాలి. నేను సోనియా గాంధీని, కాంగ్రెస్​ను విమర్శించలేదు. కేసీఆర్​ అరాచక పాలనపై పోరాటం చేసేందుకే పార్టీని వీడుతున్నానని ముందే చెప్పిన. అయితే తల్లిలాంటి సోనియాను మోసం చేశానని నాపై రేవంత్​ కామెంట్​ చేయడం దారుణం. సోనియాను బలి దేవత అన్నది రేవంత్​ కాదా? దివంగత సీఎం వైఎస్​ రాజశేఖర్​ రెడ్డిని కూడా రేవంత్​ తిట్టిండు. ప్రొఫెసర్​ జయశంకర్​, కోదండరామ్​ని కూడా తిట్టిండు. రేవంత్​ తెలంగాణ ఉద్యమంలోనే లేడు. రాష్ట్రాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు పార్టీలో ఉన్నడు. ఆయనకు తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు. మాది ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన పార్టీ. కాంట్రాక్టుల కోసం నేను పార్టీ మారుతున్నానని రేవంత్ ​అంటున్నడు. దమ్ముంటే ఆ ఆరోపణలను నిరూపించాలి. రాజకీయాల్లో మా సొంత డబ్బు పెట్టి పార్టీని గెలిపించుకుంటూ వస్తున్నాం. బీజేపీ ద్వారా మేము ఒక్క రూపాయన్నా లబ్ధి పొందినట్లు నిరూపిస్తే రాజకీయాలు మానేస్తా. నా రాజీనామా వెనక ఉన్న కారణాలను స్పష్టంగా చెప్పా. మునుగోడు అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నానని చెప్పిన. అంతేతప్ప నేను కాంగ్రెస్​ను ఎక్కడా తిట్టలేదు. నాకా పని చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ రాహుల్, సోనియా, కాంగ్రెస్​ నేతలను రేవంత్ ​తిట్టిండు” అని రాజగోపాల్​ అన్నారు.  

సీమాంధ్రుల ఓట్ల కోసమే మల్కాజ్​గిరిలో పోటీ
రాజకీయాల్లో తాము ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కాంగ్రెస్​ను నిలబెట్టుకుంటూ వచ్చామని, క్లిష్టమైన పరిస్థితుల్లో పోటీకి దిగి గెలిచామని రాజగోపాల్​ చెప్పారు. రేవంత్​ మాత్రం మహబూబ్​నగర్​లో ఓడిపోతాననే భయంతో ఎంపీ పదవికి పోటీ చేయలేదని, టీడీపీతో పొత్తు కుదుర్చుకొని సీమాంధ్రుల ఓట్లు ఉంటాయని మల్కాజ్​గిరిలో పోటీచేశారని ఎద్దేవా చేశారు. ఆయన పీసీసీ చీఫ్ అయ్యాక సాధించిన విజయం ఒక్కటీ లేదని వ్యాఖ్యానించారు. జీహెచ్​ఎంసీలో కాంగ్రెస్​ ఘోరంగా విఫలమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా చాలా చోట్ల ఓడిపోయిందన్నారు. తాము మాత్రం మునుగోడులో సర్పంచులను, ఎంపీటీసీలను, మున్సిపాలిటీలను గెలిపించామని తెలిపారు. కొందరు తన దిష్టిబొమ్మ తగులబెట్టాలని పిలుపునిచ్చారని, అలాంటి నేతలు ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తే సర్పంచుకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ను రేవంత్​ ఖతం చేస్తారని, పార్టీలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. మునుగోడులో కాంగ్రెస్​కు డిపాజిట్​ కూడా రాదన్నారు. తన నియోజకవర్గ ప్రజలే రేవంత్​కు బుద్ధి చెబుతారని రాజ​గోపాల్​పేర్కొన్నారు.