రికార్డ్ అంటే మాది..! నీకు నువ్వే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా చంద్రబాబు...? : వైఎస్ జగన్ 

రికార్డ్ అంటే మాది..! నీకు నువ్వే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా చంద్రబాబు...? : వైఎస్ జగన్ 

కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో భారీగా అవకతవకలు జరిగాయని అన్నారు వైసీపీ అధినేత జగన్. గురువారం ( జూన్ 11 ) నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. ఉద్యోగాల భర్తీ విషయంలో రికార్డ్ అంటే వైసీపీదే అని అన్నారు. మీ హయాంలో రికార్డ్ అంటూ నీకు నువ్వే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎలా చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు జగన్.

రికార్డ్ అంటే వైసీపీ హయాంలోనే:

రికార్డు అంటే వైసీపీ ప్రభుత్వ హయంలోనే జరిగిందని.. గ్రామ స్వరాజ్య సాధన, సుపరిపాలన లక్ష్య సాధన దిశగా తమ ప్రభుత్వం వేసిన  అడుగు, ఉద్యోగాల చరిత్రలో  ఒక సువర్ణాధ్యాయం అని అన్నారు జగన్. తమ రికార్డ్ ఎవ్వరూ బద్దలుకొట్టలేరని అన్నారు జగన్. మే 30, 2019న తాను సీఎంగా  ప్రమాణస్వీకారం చేస్తే, జులై 19న జీవో ఇచ్చామని.. జులై 25 -27 మధ్య నోటిఫికేషన్లు ఇచ్చామని అన్నారు.

ఎక్కడా ఒక్క తప్పుకూడా జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ, 1.3 లక్షల కొత్త ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు జగన్. ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు వారి గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారని అన్నారు.

అక్టోబరు 2, గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేసామని..అంటే నాలుగు నెలల్లోనే, అత్యంత పారదర్శకంగా, ఒక తప్పు జరగకుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించామని అన్నారు జగన్.

కానీ, మెగా డీఎస్సీ పేరుతో కూటమి  సర్కార్ నిర్వహించిన 16వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారని అన్నారు. కూటమి చేసిన గోల్‌మాల్‌ వ్యవహారాలతో ఎంతమంది కన్నీళ్లు పెడుతున్నారని.. ఎంతమంది రోదిస్తున్నారని అన్నారు. డీఎస్సీ మాత్రమే కాదు, ఏ పరీక్షకైనా పేపర్‌ తయారీ, ప్రశ్నలు అప్‌లోడ్‌ చేయడం, డిజిటల్‌ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత భద్రతతో జరగాలని...కానీ ఈ ప్రభుత్వంలో ఆ రహస్య ప్రక్రియకు పూర్తిగా తూట్లు పొడిచారని అన్నారు జగన్.