కేసీఆర్కు మునుగోడు ప్రజలు బుద్ది చెప్పాలి

కేసీఆర్కు మునుగోడు ప్రజలు బుద్ది చెప్పాలి

రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తున్న కేసీఆర్కు మునుగోడు ప్రజలు బుద్దిచెప్పాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో చరిత్ర సృష్టించే తీర్పును ప్రజలు ఇవ్వాలన్నారు. 1200 మంది బలిదానాలు చేసుకుంటే వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. కొడుకు, కూతురు పదవుల కోసమే కేసీఆర్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. ఖైతాపురం, కొయ్యలగూడెం, మందొల్ల గూడెం, తూర్పుగూడెం, సింగరాయ చెరువు, కుంట్లగూడెం, అంకిరెడ్డి గూడెం గ్రామాల్లో  వివిధ పార్టీలకు చెందిన  400 మంది కార్యకర్తలు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. 

రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి..

సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. అనవసర ప్రాజెక్టులు నిర్మించి..ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చారని విమర్శించారు. ఎన్నికల హామీలను విస్మరించారని..డబుల్ బెడ్ రూం ఇండ్ల హామీని గాలికి వదిలేశారన్నారు. పద్మశాలిలను ఆదుకోవడం లేదన్నారు.  ప్రధాని మోడీ, అమిత్ షా నాయకత్వంలో మునుగోడు గడ్డపై కాషాయ జెండా ఎగరేయాలని ప్రజలను కోరారు.