కేసీఆర్ విమానం కొనేది పారిపోవడానికే : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కేసీఆర్ విమానం కొనేది పారిపోవడానికే : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికతో కేసీఆర్ పతనం ఖాయమని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం చండూరులో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు. ఎన్నిసార్లు ఇక్కడి సమస్యలను లేవనెత్తినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యైనైనందుకు తనపై కక్షసాధింపుకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా కేసీఆర్ అణగదొక్కుతున్నారని తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. దేశంలో ఏ సీఎం పాల్పడనంతా అవినీతికి కేసీఆర్ పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి సొమ్మును మోడీ, అమిత్ షా కక్కిస్తారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. 

కేసీఆర్ విమానం కొన్నది దుబాయికి పారిపోవడానికే..

సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు పెట్టి సొంత విమానం కొనేది దుబాయికో.. సింగపూర్ కో పారిపోవడానికేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డదని, వాళ్లు జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. మోడీ, అమిత్ షాలకు భయపడి కేసీఆర్ విమానం కొనుగోలు చేశారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులకు ఆశపడి తాను బీజేపీలోకి వెళ్లినట్లు టీఆర్ఎస్ నాయకులు అసత్యం ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాను బీజేపీకి అమ్ముడు పోలేదని యాదగిరి లక్ష్మినరసింహా స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని, మరి కాదని కేసీఆర్, కేటీఆర్ ప్రమాణం చేస్తారా అని రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. దేశం మొత్తం  మునుగోడు వైపే చూస్తోందని, ఈ ఎన్నికతో కేసీఆర్ కుటుంబ పాలన అంతమవడం ఖాయమన్నారు. నల్గొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అని పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి... దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని కేసీఆర్ కు సవాలు విసిరారు. బీజేపీ పులి లాంటి పార్టీ అని, తన గెలుపుతో కేసీఆర్ పాలనకు బొంద పెడ్తామని చెప్పారు.