
యాదాద్రి : భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఖరారైంది. ఈ విషయాన్ని శనివారం వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. “భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీచేసేందుకు నాకు అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై రాహుల్ గాంధీకి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు వారి సొంత అన్నలా అండగా ఉంటాను. ప్రజల పక్షాన నిలబడి తమ కుటుంబం చేసిన సేవలను గుర్తించి తిరిగి భువనగిరి లోక్ సభ అభ్యర్థిగా గెలిపిస్తారన్న నమ్మకం మాకుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలను భువనగిరి లోక్ సభ పరిధిలో చేశాం. ఒక అన్నగా తనవాడిగా ఎప్పుడూ ఉంటానని భరోసా ఇస్తున్నాను. ప్రజలు తిరిగి నన్ను వాళ్ళ ప్రతినిధిగా ఎన్నుకుంటారని నమ్మకం ఉంది. అని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. 2018 తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచిన కోమటిరెడ్డి పరాజయం పాలయ్యారు.