
ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మార్చిలో శంకుస్థాపన చేసి.. ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రేపు దీనిపై అధికారులతో రివ్యూ చేస్తామని చెప్పారు. తాము రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడమని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గత ప్రభుత్వంల చేసిన మంచి, చెడులపై క్యాబినెట్ లో చర్చ చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్న కోమటిరెడ్డి.. 6 వేల పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు.
భువనగిరి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంపీ గా గెలిపించి తనకు పునర్జన్మ ఇచ్చారన్నారు. ప్రస్తుతం తాను భువనగిరి ఎంపీగా లేకపోయినా నియోజకవర్గ ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇంటికో వెయి రూపాయలు వేసుకోని ప్రజలే తనను గెలిపించారని వెల్లడించారు.
తెలంగాణను అభివృద్ధి చేసి చూపిస్తమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిసి జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశానని చెప్పారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి.. ఇవాళ తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.