
- ఆ పార్టీ ఎక్కడా గెలవదు.. అందులో ఒక్కరూ మిగలరు
- రెండు, మూడు చోట్ల మాత్రమే డిపాజిట్లు వస్తయ్
- ఆ పార్టీ కార్యకర్తలే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ను వెంటపడి కొడతారు
- కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 14 సీట్లలో గెలువబోతోంది
- నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతరు
- ఓఆర్ఆర్ టెండర్లపై విచారణ చేయిస్తున్నం
- ఆగస్టులో ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తం
- దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని ఎక్కడా చెప్పలే
- కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి
- హోంమంత్రి ఇంటికి వస్తే హోంగార్డుతో బయటికి పంపిన చరిత్ర మీది
- తీన్మార్ మల్లన్న, మందకృష్ణ మీద కేసులు పెట్టిందే మీరు
- అవినీతి చేయకుండానే కవితపై 8 వేల పేజీల చార్జిషీట్ దాఖలైందా?
- రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని, ఆ పార్టీలో ఒక్కరూ మిగలరని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ మినిస్టర్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా గెలవదని, ఒకటి, రెండు చోట్ల డిపాజిట్లు మాత్రమే వస్తాయని అన్నారు. 10 ఏళ్లు అధికారం లో ఉండి 4 నెలల్లో పార్టీ బంద్ అయిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదన్నారు. ఆ రికార్డును బీఆర్ఎస్ సృష్టించబోతోందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ కు కనీసం ఏజెంట్లు కూడా లేరని చెప్పారు. బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ నాయకులే ఓపెన్ గా చెప్పారని అన్నారు. జూన్ 4వ తేదీ తర్వాత పార్టీ క్లోజ్ అవుతుందని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును కార్యకర్తలే కొడతారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 14 లోక్ సభ స్థానాల్లో విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులుంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని అన్నారు. కవిత జైల్లో ఉండటం, ఎన్నికల్లో ఓటమి, ఇంట్లో గొడవల కారణంగా కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. 30 వేల ఉద్యోగాలను ఎన్నికలకు ముందు ఎందుకు ఇవ్వలేదో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ లో ఉంటే మంత్రులను డమ్మీలను చేసి రాజ్యం నడిపింది కేటీఆర్ కాదా.. అన్నారు. కేబుల్ బ్రిడ్జిని చూపించి హైదరాబాద్ అభివృద్ధి చేశామని చెప్పుకొంటున్న కేటీఆర్.. మూసీ నదిని ఎందుకు అభివృద్ది చేయలేదో చెప్పడం లేదన్నారు. హైదరాబాద్ నుంచి ఏ కంపెనీ పోలేదని, కేటీఆర్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. త్వరలో ఓల్డ్ సిటీలో మెట్రోను ప్రారంభించబోతున్నామని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి దేశమంతా తెలుసునని, పక్క రాష్ట్రాలకు పోతే తెలంగాణ అనగానే కాళేశ్వరం, లిక్కర్ స్కాం ను గుర్తు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్ టెండర్లను తక్కువ ధరకు అమ్ముకొని, కమీషన్లు దండుకున్నారని దీనిపై విచారణ జరుగుతోందని కోమటరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆగస్టులో ట్రిపుల్ ఆర్ టెండర్లను పిలుస్తామని చెప్పారు. భూ సేకరణకు హడ్కో లోన్ తీసుకుంటామని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్న మీద కేసులున్నాయని అంటున్నారని, ఆ కేసులు పెట్టింది మీరు కాదా..? అని మంత్రి ప్రశ్నించారు. మందృకష్ణమాదిగ మీద కూడా కేసులు పెట్టారని గుర్తు చేశారు. పదేండ్ల పాటు కాంగ్రెస్ లీడర్లను గృహనిర్బంధం చేశారని అన్నారు.
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని చెప్పలే
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని తాము ఎక్కడా చెప్పలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సన్న వడ్లను కొనుగోలు చేసి హాస్టల్స్, రేషన్ కింద పేద వారికి ఇస్తామని అన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి తీరుపై కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన పేరు చెప్పాలంటే తనకే సిగ్గుగా ఉందని అన్నారు. రాజాసింగ్ ను కాదని పైరవీలు చేసుకొని ఫ్లోర్ లీడర్ పదవి తెచ్చుకున్నారని అన్నారు. ఆయన యూటాక్స్ గురించి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి ఎమ్మెల్యేలుగా ఉన్నా సొంత ఇల్లు లేదని అన్నారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటని అన్నారు