రైతులకు చెప్తానన్న శుభవార్త ఎక్కడికి పోయింది: కేసీఆర్‌‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

రైతులకు చెప్తానన్న శుభవార్త ఎక్కడికి పోయింది: కేసీఆర్‌‌కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌‌కు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. వారంలో రైతులకు శుభవార్త చెప్తాను అని కొండపోచమ్మ సాగర్‌‌ ప్రారంభోత్సవం రోజు చెప్పిన మాట ఎక్కడపోయిందని ప్రశ్నించారు. ప్రపంచం తెలంగాణ వైపు చూసే విధంగా, దేశం అబ్బురపడే విధంగా శుభవార్త ఉంటుందని చెప్పి 2 నెలలు అయిందని, ఆ శుభవార్త ఏంటో మాత్రం ఇప్పటికీ చెప్పలేదని ఆయన అన్నారు. ఆ వార్త ఎంటా అని రైతులంతా ఎదురుచూస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. దేవుడి దయవల్ల మంచి వర్షాలు పడ్డాయని, చెరువులు నిండి రైతులు భూములను సాగు చేసుకుంటున్నారని, ఆ శుభ వార్త ఏంటో చెప్పి రైతులకు మంచి చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో ఇచ్చిన దళిత సీఎం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులు, గిరిజనులకు మూడు ఎకరాల భూమి, రైతులకు ఏకకాలంలో లక్షరూపాయల రుణమాఫీ లాంటి హామీలు విస్మరించినట్లు దీన్ని కూడా విస్మరించొద్దని అన్నారు. ప్రభుత్వం చేసిన 25 వేల రుణమాఫీ రైతుల వడ్డీలకే సరిపోలేదని చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం సమంజసం కాదు అని అన్నారు. మిగితా హామీల లాగే ఇది కూడా బోగస్ హామీనేనా అని ప్రశ్నించారు. సీఎం రైతులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వర్షాల వల్లే చెరువులు నిండాయి తప్ప కేసీఆర్ గొప్పతనం ఏమీలేదని కోమటిరెడ్డి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో 90 శాతం పూర్తి అయినా ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణ పల్లి, వెల్లంపల్లి, పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను కేసీఆర్ పట్టించుకోలేదని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కమిషన్లు డండుకుంటున్నారని కోమటరెడ్డి అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని చెప్పారు.