
సిద్దిపేట/ కొమురవెల్లి, వెలుగు: కొమురెల్లి మల్లన్న పెండ్లి మనోహరంగా జరిగింది. వీరశైవ సంప్రదాయం ప్రకారం తోటబావి కల్యాణ వేదికపై ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది.మహారాష్ట్రలోని బార్శీకి చెందిన శ్రీశ్రీశ్రీ 108 శ్రీగురుసిద్ధ మణికంఠ శివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో వేడుకలను నిర్వహించారు. గర్భ గుడి నుంచి మల్లికార్జునస్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా మండపానికి చేర్చారు. మహదేవుని, పగిడన్నగారి వంశస్తుల ఇండ్ల నుంచి మల్లికార్జున స్వామి, బలిజ మేడాలదేవి, గొల్లకేతమ్మ అమ్మవార్లకు పట్టువస్త్రాలు, పుస్తె మట్టెలు, ముత్యాల తలంబ్రాలు, ఒడిబియ్యంను తీసుకొచ్చారు.
మేడాలదేవి, కేతమ్మల తరుఫున మహాదేవుని వంశస్తులైన రవి, సింధు దంపతులు, వరుడు మల్లికార్జునస్వామి తరుఫున పగిడన్నగారి వంశస్తులైన మల్లయ్య, బాలమణి దంపతులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు వరుడు మల్లికార్జునస్వామి వధువులు మేడాలదేవి, కేతమ్మలకు మాంగళ్యధారణ చేసి పరిణయమాడారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొని స్వామివారికి బంగారు పుస్తె మట్టెలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. నిరుడు ప్రకటించినట్టుగా మల్లిఖార్జునస్వామి మూలవిరాట్‌కు కిలోన్నర బంగారు కిరీటం, కోర మీసాన్ని అందజేశారు. కొమురవెల్లి గ్రామపంచాయతీ, స్థానిక ఒగ్గు పూజారులు వేరు వేరుగా స్వామికి పట్టువస్త్రాలు, పుస్తె మట్టెలు సమర్పించారు. మల్లన్న పెండ్లికి దాదాపు 30 వేల మంది భక్తులు హాజరయ్యారు. రాత్రి 9 గంటలకు మల్లన్నస్వామితో పాటు అమ్మవార్ల ఉత్సవ విగ్రహలతో శకటోత్సవాన్ని నిర్వహించారు.
దృష్టి కుంభంతో తొలి దర్శనం
మల్లన్న కళ్యాణంలో భాగంగా ఆదివారం మబ్బుల ఆలయ గర్భగుడిలో దృష్టి కుంభం నిర్వహించి స్వామి తొలి దర్శనాన్ని ప్రారంభించారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు గ్రామంలో సేకరించిన రతి బియ్యాన్ని వండి ఒక చోట కుప్పగా పోసి దృష్టి కుంభంగా తయారు చేశారు. ప్రత్యేక పూజల తర్వాత దృష్టికుంభంపై గుమ్మడి కాయను బలిహరణ చేశారు. అనంతరం మల్లన్న చూపును అద్దంలో పడేటట్లు చూసి ఆలయ అర్చకులు, అధికారులు తొలిదర్శనం చేసుకొని భక్తులకు అనుమతి ఇచ్చారు. దృష్టి కుంభంకు వినియోగించిన అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా పంచారు.
వచ్చే ఏడాది అమ్మవార్లకు బంగారు కిరీటాలు
మల్లన్న కళ్యాణోత్సవం తరువాత హరీశ్‌రావు మాట్లాడుతూ వచ్చే ఏడాది స్వామి కల్యాణం వరకు గొల్ల కేతమ్మ, బలిజ మేడమ్మ అమ్మవార్లకు ఒక కిలో బంగారంతో కిరీటాలు చేయిస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ రూ.30 కోట్లు కేటాయించి కొమురవెల్లి ఆలయాన్ని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. భక్తులకు కావాల్సిన క్యూలైన్లు, 50 గదుల సత్రం, కోనేరుతో పాటు దేవాలయ అభివృద్ధికి రూ.11కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కొందరు ఎన్ని కుట్రలు చేసినా మల్లన్న దయతో మల్లన్న సాగర్ ప్రాజెక్టును అనుకున్న టైమ్‌కు పూర్తి చేసుకున్నామన్నారు. మల్లన్న సాగర్ ను ప్రారంభం చేసి గోదావరి జలాలతో సీఎం కేసీఆర్ మల్లన్న పాదాలు కడిగి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు.