
ఎల్బీనగర్, వెలుగు: తెలంగాణ ఉద్యమానికి ఆత్మగా నిలిచిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్ చౌరస్తాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.
స్వాతంత్య్ర పోరాటంతో పాల్గొనడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం ఆకాంక్షించిన గొప్ప వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే సుధీర్, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరన్ రెడ్డి, బీజేపీ లీడర్లు సామ రంగారెడ్డి, సత్యనారాయణ, వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు.
బాపూజీని జాతిపితగా ప్రకటించాలి
హైదరాబాద్ సిటీ: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని జలదృశ్యం వేదికగా బీసీ రాజ్యాధికార సమితి ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఎమ్మెల్సీ ఎల్.రమణ హాజరయ్యారు. బాపూజీని తెలంగాణ జాతిపితగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.