గోదావరి పుష్కరాలంటే ఆంధ్రా కాదు.. తెలంగాణ అనేలా చేస్తాం: మంత్రి కొండా సురేఖ

గోదావరి పుష్కరాలంటే ఆంధ్రా కాదు.. తెలంగాణ అనేలా చేస్తాం: మంత్రి కొండా సురేఖ
  • బాసర నుంచి భద్రాచలం వరకు దేవాలయాల అభివృద్ధి 

వరంగల్‍, వెలుగు : ‘గోదావరి పుష్కరాలంటే ఆంధ్రా కాదు.. తెలంగాణ అన్నట్లు చూపుతాం’ అని మంత్రి కొండా సురేఖ చెప్పారు. జూన్‌‌‌‌‌‌‌‌లో గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు  పూర్తి చేస్తామన్నారు. బుధవారం వరంగల్‌‌‌‌‌‌‌‌ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టెంపుల్‌‌‌‌‌‌‌‌ టూరిజం అభివృద్ధే లక్ష్యంగా, వివిధ పనుల కోసం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి రూ.4,500 కోట్లు మంజూరు చేశారన్నారు. 

ధర్మపురి మినహా బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ఆలయాల అభివృద్ధి పనులు స్పీడ్‌‌‌‌‌‌‌‌గా సాగుతున్నాయన్నారు. వివిధ పనుల కోసం సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇటీవలే రూ. 1000 కోట్లు విడుదల చేశారని, కేబినెట్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో అప్రూవల్‌‌‌‌‌‌‌‌ వచ్చిన వెంటనే పుష్కరఘాట్ల నిర్మాణాన్ని చేపడుతామన్నారు. సరస్వతి అంత్య పుష్కరాల కోసం కాళేశ్వరం వద్ద రూ.30 కోట్లతో పనులు పూర్తి చేశామన్నారు. 

సరస్వతి అంత్య పుష్కరాల నిర్వహణలో భాగంగా ప్రతీరోజు సాయంత్రం గోదావరి హారతితో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్లు చెప్పారు. పుష్కర స్నానాలకు పిల్లలు, వృద్ధులు సైతం వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. దేవాదాయశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీచేస్తామని చెప్పారు. సమావేశంలో భద్రకాళి ఆలయ ఈవో రామల సునీత పాల్గొన్నారు.