కడియం తీరుపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

కడియం తీరుపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
  •     దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించడంపై అభ్యంతరం
  •     క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: స్టేషన్ ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయశాఖ అధికారులతో అధికారిక సమీక్ష నిర్వహించడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి మంగళవారం లేఖ రాసి ఫిర్యాదు చేశారు. శాఖా పరమైన పరిపాలన, విధాన నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ లాంటివన్నీ సంబంధిత మంత్రి పరిధిలోకి వస్తాయని లేఖలో స్పష్టం చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా కడియం శ్రీహరి దేవాదాయశాఖ డైరెక్టర్, ఇతర అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. 

దేవాలయాల అభివృద్ధి, నిధుల కేటాయింపు, మాస్టర్ ప్లాన్లు, భూముల పరిరక్షణ వంటి కీలక అంశాలపై సమీక్ష నిర్వహించి, అధికారులకు గడువులు విధించడం ‘రూల్స్ ఆఫ్ బిజినెస్’ స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని మంత్రి ఫైర్ అయ్యారు.  ఇలాంటి చర్యల వల్ల అధికార యంత్రాంగంలో అయోమయం నెలకొంటుందని, సమన్వయం లోపిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎంను కోరారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించి, కడియం శ్రీహరి నుంచి వివరణ కోరాలన్నారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ ద్వారా విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.