భద్రాద్రి రాములోరి పెండ్లికి రండి... సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, అర్చకులు

భద్రాద్రి రాములోరి పెండ్లికి రండి... సీఎం రేవంత్రెడ్డిని ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ, అర్చకులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం జూబ్లీహిల్స్‌‌‌‌లోని ఆయన నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అర్చకులతో కలిసి వెళ్లి ఆహ్వాన పత్రిక అందజేశారు. 

ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి ప్రసాదం అందజేశారు. కాగా, భద్రాచలంలో గురువారం శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమ‌‌‌‌య్యాయి. ఏప్రిల్ 2వ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 27న స్వామివారి తిరుకల్యాణం ఘ‌‌‌‌నంగా నిర్వహించనున్నారు. 

ఈ వేడుకకు ప్రభుత్వం తరఫున హాజరై, స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించాలని ముఖ్యమంత్రిని మంత్రులు కోరారు. ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.