తెలంగాణ వైతాళికుడు కొండా వెంకట రంగారెడ్డి : వెల్మల విక్రమ్​

తెలంగాణ వైతాళికుడు కొండా వెంకట రంగారెడ్డి : వెల్మల విక్రమ్​

పట్టుదలకు మరోపేరు కొండా వెంకట రంగారెడ్డి. రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక స్థానం. అసమాన నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. చిన్నతనం నుంచే చదువు మీద ఆసక్తితో, ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగారు. న్యాయవాదిగా, మానవతా విలువలు కలిగిన పాలకుడిగా, ప్రజా నాయకుడిగా ప్రజలకు దగ్గరయ్యారు. రెవెన్యూ మంత్రిగా ఎన్నో విప్లవాత్మక భూ సంస్కరణలు తీసుకువచ్చిన నేత రంగారెడ్డి. కౌలుదారుల హక్కుల చట్టాన్ని రూపొందించి, భూమి కోసం జరిగిన పోరాటాల్లో దున్నేవాడికే భూమి అనే గొప్ప నినాదాన్ని నిజం చేసిన వ్యక్తి. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం అహర్నిశలు శ్రమించేవారు. తనను ఎంత మంది వ్యతిరేకించినా, ప్రజల కోసం నమ్మిన సిద్ధాంతాలను ఎన్నడూ వదిలేయలేదు. ఎల్లప్పుడూ ప్రజల జీవితాల్లో అభివృద్ధి తీసుకురావడం కోసమే పని చేశారు.

బాలికలకు విద్యను అందుబాటులోకి తీసుకువస్తే సమాజంలో అభివృద్ధి సాధ్యం అవుతుందని బలంగా నమ్మి, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను, మహిళా కళాశాలలను స్థాపించి విద్యా రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసి, ఎన్నో కుటుంబాల్లో విద్యా వెలుగులు నింపిన దూరదృష్టి గల నాయకుడు. వారు స్థాపించిన ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో ఇప్పటికీ మన పిల్లలు చదువుకుంటున్నారు. పల్లెటూర్ల నుంచి చదువుకోవడానికి హైదరాబాద్ కు వచ్చే విద్యార్థినుల కోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేసిన ముందుచూపు కలిగిన వ్యక్తి కొండా వెంకట రంగారెడ్డి.  రైతులకు సహకార సంఘాల ఏర్పాటుతో మేలు జరుగుతుందని ఉద్యమించి ‘సహకార్ రంగారెడ్డి’గా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అరుదైన గుర్తింపు పొందారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో విలీనాన్ని నిర్ద్వంద్వంగా ఖండించి తెలంగాణ రాష్ట్ర ఆశయాలను తెలిపిన ఉద్యమకారుడు. ‘గులామీకి జిందగీ సే మౌత్ బెహతర్ హై’ అని నినదించిన ధీశాలి కొండా వెంకట రంగారెడ్డి. ఆనాటి నినాదమే తర్వాతి కాలంలో తెలంగాణ ఆత్మగౌరవ నినాదమైంది.

ఆపరేషన్​ పోలో వెనుక..

మన భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చి75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో 1947లో అప్పటి భారత ప్రభుత్వం నిజాం రాజుతో సంధి కోసం నియమించిన లాయర్  కేఎం మున్షి రచించిన ‘ది ఎండ్ ఆఫ్ అన్ ఎరా ..- హైదరాబాద్ మెమోయిర్స్’ పుస్తకంలో కొండా వెంకట రంగారెడ్డి గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరానికిపైగా హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజల మీద రజాకార్లు అమానుషంగా జరుపుతున్న హింస గురించి మొదట 1948 ఏప్రిల్​24న జవహర్ లాల్ నెహ్రూని కలిసి విన్నవించగా వచ్చిన హామీతో నిరాశ చెంది, ఆ తర్వాత డెహ్రాడూన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు వివరించగా వారు ధైర్యం ఇచ్చారు. అప్పటికే కాశ్మీర్ లో యుద్ధం ఉండటంతో 1948 సెప్టెంబర్ 13న అత్యవసర పోలీసు చర్యను ఆపరేషన్ పోలో మొదలు పెట్టింది. ఈ చర్య కోసం పట్టుబట్టిన ధైర్యవంతులు కొండా వెంకట రంగారెడ్డి. రజాకార్ల హింస నుంచి విముక్తి కల్పించడంలో, తెలంగాణను భారతదేశంలో విలీనం చేయడంలో ఎంతో కృషి చేశారు.

నిజాంకు వ్యతిరేకంగా పోరాడి..

ప్రజల కేంద్రంగా నడిచే రాజకీయాలు ఉండాలని, అదే ప్రజాస్వామ్యానికి అసలైన నిర్వచనం అని, ప్రజల కోసం చట్టసభల్లో ఉండి ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రంగాల్లో చట్టాలను రూపొందిన రాజనీతిజ్ఞుడు రంగారెడ్డి. నిజాం ప్రభుత్వ శాసనసభ్యుల అసెంబ్లీ/మండలి అప్పటి ‘‘మజ్లిస్  ఎ -వజాకానిస్’’ కు లాయర్ల ఓటింగ్ ద్వారా ఎన్నికైన ఇద్దరిలో కొండా వెంకట రంగారెడ్డి ఒకరు. ప్రభుత్వానికి, నిజాం రాజు కు కూడా వ్యతిరేకంగా ఎన్నో చట్టాలను బడుగు బలహీనర్గాల ప్రజల కోసం తీసుకువచ్చిన ధైర్యవంతుడు రంగారెడ్డి. రాజు ప్రభుత్వంలో ఉండి రాజుకు వ్యతిరేకంగా, ప్రజలకు న్యాయంగా చట్టాలు తయారు చేసి, చట్టాలను పాస్ చేయించి, వాటిని అమలు చేసిన గొప్ప పాలకుడు. ఒక లాయర్ కు ఉండాల్సిన చాకచక్యం/చాణక్యం, ఒక మహాత్ముడికి/సాధువుకు ఉండాల్సిన విలువలను వెంకట రంగారెడ్డి గారిలో మనం చూడవచ్చు.  పిల్లలు, మహిళలు, రైతుల హక్కుల కోసం ఆయన చేసిన గొప్ప పనిని, వారి అనుభవాన్ని గుర్తుచేసుకొని అదే స్ఫూర్తితో వారి ఆశయాల సాధనకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ వైతాళికుడు, సాయుధ పోరాట యోధుడు, రజాకార్ల మీద చర్య తీసుకోవాలని భారత దేశ ప్రభుత్వాన్ని ఒప్పించిన ధైర్యవంతుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి  కొండా వెంకటరంగా రెడ్డి132వ జయంతి సందర్భంగా  ఆయనకు ఇవే ఘననివాళులు. 

- వెల్మల విక్రమ్​
ఆలుమ్ని, ఎంఐటీ స్కూల్​ ఆఫ్​ గవర్నమెంట్​, పుణె