వెలుగు ఓపెన్ పేజీ: ప్రైవేట్ యూనివర్సిటీల తీరు మారాలి!

వెలుగు ఓపెన్ పేజీ: ప్రైవేట్ యూనివర్సిటీల తీరు మారాలి!

మానవ వికాసానికి మూలం విద్య.  ఈ ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యుగంలో విద్యపాత్ర చాలా కీలకమైనది.  విద్యాభ్యాసం వివిధ దశలలో జరుగుతుంది.   మనదేశంలో  పాఠశాల విద్య,   మాధ్యమిక విద్య,  ఉన్నత విద్య ఇలా వివిధ దశలలో  విద్యాబోధన జరుగుతోంది.  పాఠశాల విద్య,  మాధ్యమిక విద్య కన్నా ఉన్నత  విద్యాబోధన కీలకమైనది.  దేశ అభివృద్ధి కేవలం ఉన్నత  విద్యాబోధనపైనే  ఆధారపడి ఉన్నది. ఉన్నత  విద్యాబోధన వలన దేశానికీ అత్యంత  విలువైన మానవ వనరులు సమకూరుతాయి.  

మన దేశంలో  ఉన్నత విద్యను  అభ్యసించిన విద్యార్థులు ప్రపంచంలో అత్యున్నతమైన కంపెనీల్లో వివిధ కీలక హోదాల్లో పనిచేస్తున్నారు.  అలాంటి ఉన్నత విద్యాబోధన మనదేశంలో యూనివర్సిటీల ద్వారా జరుగుతోంది. యూనివర్సిటీల నియంత్రణ ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్’ పరిధిలో ఉంటుంది.  2025 డిసెంబర్ 31 నాటికి మన దేశంలో సుమారు 1,268 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.  వాటిలో 57 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 515 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కాగా  150 యూజీసీ  ఆమోదించిన డీమ్డ్ యూనివర్సిటీలు,  546 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. 

దేశంలో ఎక్కువ విశ్వవిద్యాలయాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (107) ఆ తరువాత స్థానంలో  గుజరాత్ (100) ఉన్నది.  ఇక మన రాష్ట్రానికి వస్తే  ఆర్ట్స్,  సైన్స్ & టెక్నాలజీకి సంబంధించిన యూనివర్సిటీలు  మొత్తం సుమారుగా 41 ఉన్నాయి.  వాటిలో  డీమ్డ్ యూనివర్సిటీలు 8,  ప్రైవేట్ యూనివర్సిటీలు 10 ఉండగా, సెంట్రల్ యూనివర్సిటీలు 4,  స్టేట్ యూనివర్సిటీలు 19 ఉన్నాయి.  

అయితే, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ప్రస్తుత జనాభాకి సరిపడా సంఖ్య లేకపోవడం వలన  యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్  కొన్ని  ప్రైవేట్,  డీమ్డ్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అనుమతి ఇస్తుంది.  దేశంలో ఉన్నత విద్యను బలోపేతం చేయడం కూడా ఈ విశ్వవిద్యాలయాల ఏర్పాటు అనుమతికి మరొక ముఖ్యకారణం.  వాస్తవానికి కొన్ని  ప్రైవేట్ యూనివర్సిటీలు  ప్రభుత్వ యూనివర్సిటీలకు దీటుగా బోధన చేయడమే కాకుండా విద్యార్థులకు  ప్లేస్​మెంట్,   రీసెర్చ్ విషయాలలో  ఉత్తమ ఫలితాలు చూపించడంతోపాటు రీసెర్చ్ పబ్లికేషన్,  పేటెంట్ల  సాధనలో  ముందువరసలో ఉంటున్నాయి.  

ప్రైవేట్ యూనివర్సిటీలునాణ్యమైన విద్యాబోధన చేస్తున్నాయా?

ఆయా ప్రైవేట్ యూనివర్సిటీలు నాణ్యమైన విద్యాబోధన చేస్తున్నాయా?  ఫీజుల విషయంలో నియంత్రణ పాటిస్తున్నాయా? యూనివర్సిటీలో పనిచేసే బోధన,  బోధనేతర సిబ్బంది నియామకాలు, వేతనాలు  యూజీసీ  గైడ్​లైన్స్ ప్రకారం జరుగుతున్నాయా?  ముఖ్యంగా ఆయా విశ్వవిద్యాలయాలు 'రూల్ అఫ్ రిజర్వేషన్స్' వర్తింపజేస్తున్నాయా?  మొత్తంగా సమాజానికి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల కంట్రిబ్యూషన్ ఏమిటీ? అనేవి కీలకమైన అంశాలు.  

గడచిన పదేళ్లలో  దేశంలో ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్,  డీమ్డ్ యూనివర్సిటీలు  ఏర్పాటయ్యాయి.  దేశవ్యాప్తంగా సుమారు అన్ని యూనివర్సిటీల సంఖ్య 2015–-16లో 755 ఉండగా  అది 2025 నాటికి 1,268కి చేరింది.  అంటే  పదేళ్లలో సుమారు 67.95 శాతం యూనివర్సిటీల సంఖ్య పెరిగింది. వాటిలో  ప్రైవేట్,  డీమ్డ్ యూనివర్సిటీల పెరుగుదలే ఎక్కువ.  దేశవ్యాప్తంగా  రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల సంఖ్య పెరిగినప్పటికీ,  ప్రైవేట్,  డీమ్డ్ యూనివర్సిటీలు ఎక్కువ సంఖ్యలో పెరిగాయి.

అర్హతలేని అధ్యాపకులతో బోధన

 కొన్ని యూనివర్సిటీలు అర్హత కలిగిన అధ్యాపకులను  నియమించుకొని  విలువలతో  కూడిన బోధన చేస్తున్నప్పటికీ  మెజారిటీ  ప్రైవేట్ యూనివర్సిటీలు మాత్రం అర్హత లేని అధ్యాపకులతో బోధన చేపడుతున్నాయి.  అధ్యాపకుల నియామకాలలో  యూజీసీ నిబంధనలు పాటించకుండా కేవలం తక్కువ జీతానికి అధ్యాపకులను నియమించుకొని  బోధన  చేయిస్తున్నాయి.  అధ్యాపక  నియామకాలలోనే కాకుండా అధ్యాపకేతర నియామకాలలో సైతం నిబంధనలు  పాటించడం లేదు.  

అధ్యాపక నియామకాలలో,   విద్యార్థుల  అడ్మిషన్ ప్రక్రియలో రూల్ అఫ్ రిజర్వేషన్​ను పాటించడం లేదు.  వివిధ విద్యార్థి సంఘాలు సైతం ప్రైవేట్ యూనివర్సిటీలలో  రిజర్వేషన్లపై   ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నాయి.  ప్రభుత్వ నిధులను  ప్రత్యక్షంగానో,  పరోక్షంగానో  ప్రయోజనం  పొందుతున్న ప్రైవేట్ యూనివర్సిటీలలో  తప్పనిసరిగా రూల్ అఫ్ రిజర్వేషన్స్ పాటించాలి.  ప్రైవేట్ యూనివర్సిటీలు  ప్రభుత్వాల నుంచి కోట్ల రూపాయలు పొందుతున్నాయి.  

కేంద్ర,  రాష్ట్ర యూనివర్సిటీల  మాదిరిగా  ప్రైవేట్ యూనివర్సిటీలకు బడ్జెట్ ద్వారా నిధుల కేటాయింపు ఉండదు.  కానీ,  ప్రభుత్వ నిధులు మాత్రం వివిధ రూపాల్లో వాటికి చేరతాయి.  ముఖ్యంగా యూజీసీ, డిఎస్​టి, ఐసిఎన్ఆర్,  ఐసిఎస్ఎస్ఆర్, ఏఐటిసి వంటి  కేంద్ర  ఇన్​స్టిట్యూషన్స్  నుంచి  రీసెర్చ్ గ్రాంట్స్,  ప్రాజెక్టుల  రూపంలో  నిధుల ప్రవాహం జరుగుతుంది. అలాగే, కొన్ని యూనివర్సిటీలకు ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ వంటి పథకాల ద్వారా ఇన్నోవేషన్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్  నిధులు కూడా అందుతాయి. 

సమాజానికి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల కంట్రిబ్యూషన్ ఏమిటి? 

 కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకోసం ప్రభుత్వ భూములు, టాక్స్ సబ్సిడీలు వంటివి ఇస్తుంటాయి.  కానీ సమాజానికి ప్రైవేట్ విశ్వవిద్యాలయాల  కంట్రిబ్యూషన్ ఏమిటి? అనేది  ప్రశ్నార్థకంగా మారింది.  ప్రభుత్వ యూనివర్సిటీలు.. విద్యార్థులకు తక్కువ  ఫీజులతో  నాణ్యమైన విద్యను  బోధించడం,  పేద విద్యార్థులకు స్కాలర్​షిప్​లు  ఇవ్వడం,  ఫీజు  రీయింబర్స్​మెంట్ చేయడం,   సుశిక్షులైన,  అర్హత కలిగిన అధ్యాపకులతో  బోధన చేపట్టడం,  గ్రంథాలయ వసతి,  పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా  విద్యార్థులకు  ప్రత్యేక క్లాస్​లు తీసుకోవడం,  స్పోర్ట్స్,  సాంస్కృతిక అంశాలలో  విద్యార్థులను ప్రోత్సహించడం,  వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ద్వారా ఎన్నో రకాలుగా సమాజానికి ఉపయోగపడుతున్నాయి.  కానీ,  లాభాపేక్షతో నడిపించే  ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు  ఇవన్నీ  చేస్తున్నాయా? ముఖ్యంగా, విద్యార్థులలో  దేశభక్తి, భారతీయ సమాజం పట్ల అంకితభావం వంటివి  ప్రైవేట్ విశ్వవిద్యాయాలలో చదివే విద్యార్థులకు అలవడతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేయాలి

ప్రభుత్వాలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు చట్టాలు అయితే చేస్తున్నాయి.  కానీ, వాటిపై పెద్దగా పర్యవేక్షణ పెట్టడం లేదు. ముఖ్యంగా ఫీజుల విషయంలో ప్రభుత్వం తగిన మార్గదర్శకాలు జారీ చేయాలి.  ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో  ఫీజుల ఏకీకృతం తప్పనిసరి చేయాలి. అలాగే రూల్ అఫ్ రిజర్వేషన్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి.  ప్రైవేట్ విశ్వవిద్యాలయాల యాజమాన్యం సైతం లాభాపేక్షతోపాటు విలువైన నాణ్యమైన విద్యను అర్హత కలిగిన అధ్యాపకులచే బోధించాలి.  

విద్యార్థులను యూనివర్సిటీలకు  ఫీజులు చెల్లించే  'ఆస్తి'లా  కాకుండా  సమాజానికి  ఉపయోగపడే 'ఇంధనం'లా  తయారుచేసి వారి  సర్వతోముఖాభివృద్ధిపై దృష్టిపెట్టాలి.  భారత  రాజ్యాంగం అందించిన  రిజర్వేషన్ పద్ధతిని  ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా అమలుచేయాలి.  అప్పుడే, ఆయా విద్యాలయాల ఏర్పాటుకు సార్థకత  చేకూరుతుంది.  కేవలం డిగ్రీలు  పొందడమే కాకుండా విద్యార్థిలో  బాధ్యతను  పెంపొందించేలా నిర్ణయాలు తీసుకోవాలి.   ప్రైవేట్ యూనివర్సిటీలు కేవలం ఆదాయ సముపార్జన మీదనే కాకుండా సమాజానికి ప్రయోజనం చేకూరేలా దృష్టిపెట్టాలి. అప్పుడే ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపనకు సార్థకత చేకూరుతుంది. 

ఐదేళ్లలో భారీగా  ప్రైవేట్ యూనివర్సిటీలు

2020-–21లో  ప్రైవేట్,  డీమ్డ్ యూనివర్సిటీల సంఖ్య 456 ఉండగా అది 2024-–25కి  696కి చేరింది.  మన రాష్ట్రంలో  కూడా 2020–-21 నాటికి కేవలం 7 డీమ్డ్,  ప్రైవేట్ యూనివర్సిటీలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 18కి  చేరుకుంది.  అంటే  గత  ఐదేళ్లలో  మన రాష్ట్రంలో  భారీగా  ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి.  2021-–2022లో  26.9 శాతంగా ఉన్న విద్యార్థుల ఎన్​రోల్​మెంట్​ 2025-– 26కి  సుమారు 35 శాతానికి  చేరుతుందని అంచనా. 

ఆయా యూనివర్సిటీల్లో చదివే  విద్యార్థులలో అధికభాగం సంపన్న వర్గాలకు చెందినవారే ఉంటున్నారు.  ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో పరిమిత సంఖ్యలో అడ్మిషన్స్ ఉండటం చేత విద్యార్థులు ప్రైవేట్ యూనివర్సిటీలను ఎంచుకోవడం వలన ప్రతీ సంవత్సరం  ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల సంఖ్య పెరుగుతోంది.  ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఉండే ఫీజుల కంటే అధికంగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు విద్యార్థుల నుంచి  ఫీజులను వసూలు చేస్తుండటం గమనార్హం.  

డొనేషన్స్,  ఫీజులు,  ఇతరత్రా  మార్గాల రూపంలో  లక్షల రూపాయలు విద్యార్థులు ప్రైవేట్ యూనివర్సిటీలకు చెల్లిస్తున్నారు. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీలలో నాణ్యమైన,  విలువలతో  కూడుకున్న విద్యాభోదన జరుగుతోందా లేదా అనేది ప్రశ్నార్థకం.

 ప్రొఫెసర్ చెన్నప్ప దాసరి,ఉస్మానియా యూనివర్సిటీ