నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఆహార కల్తీలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉన్నది. కొద్ది నెలల క్రితం నగరంలోని జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ బృందాలతో కూడిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లలోని డొల్లతనం తనిఖీలలో బయటపడుతున్న పరిస్థితి నగరవాసులకు ఆందోళన కలిగించింది. 10 చోట్ల పరిశీలిస్తే కనీసం 3 చోట్ల గడువు తీరిన ఆహార పదార్థాలు, పాడైపోయిన ఆహారం కనిపించింది.
రుచికి తప్ప శుభ్రతకు చాలా హోటల్స్, రెస్టారెంట్లు ప్రాధాన్యత ఇవ్వడం లేదని టాస్క్ ఫోర్స్ బృందాలు గుర్తించాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నిలిచే బిర్యానీలో కూడా నాణ్యత రోజురోజుకూ తగ్గిపోతోంది. తందూరి చికెన్, చికెన్ 65 లాంటి మాంసాహార వంటకాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఆహార భద్రతా విభాగం సూచిస్తోంది. వంటచేసే పరిసరాల్లో ఎలాంటి శుభ్రత పాటించడం లేదని, దుర్గంధంతో కూడిన వంటగది పరిసరాలు, అపరిశుభ్రంగా గిన్నెలు, వాటిపై కుప్పలు కుప్పలుగా బొద్దింకలు ఉండడం టాస్క్ఫోర్స్ తనిఖీల్లో బయటపడింది.
కఠినంగా వ్యవహరించాలి
ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు 20 శాతం సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. 14 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో సేకరించి పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 14 కల్తీ ఆహారంగా తేలుతున్నాయి. ఇక ఆ తర్వాత 13.11 శాతంతో కేరళ.. 9 శాతంతో ఆంధ్రప్రదేశ్.. 6.30 శాతంతో కర్ణాటక తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారులు నిబంధనలకు పాతరేస్తూ నామమాత్రపు తనిఖీలు చేయకుండా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కఠినంగా వ్యవహరించాలి.
లైసెన్సుల జారీ విషయంలోనే మరింతగా కఠిన నియమాలు అమలు చేయాలి. ఆయా ఆహార పదార్థాలపై తయారీ తేదీ, ఎంతకాలంలోగా విని యోగించాలనే వాటిని ముద్రించకుండానే విక్రయిస్తున్నారు.పాలల్లో డిటర్జంట్ పొడి, యూరియా, గంజి కలిపి కల్తీ చేస్తున్నారు. తేనెలో పంచదార, బెల్లం పాకం కలుపుతున్నారు.
ఐస్‌క్రీంలో వాషింగ్ పౌడర్‌లు, పండ్లపై మైనంను పూతగా పూస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాల నివారణకు తూనికలు, కొలతలు, పౌర సరఫరా శాఖల పర్యవేక్షణ చాలా మేరకు మెరుగుపడాల్సిన అవసరం ఉంది.
నిరంతరం నిఘా కొనసాగాలి
కల్తీ ఆహార పదార్థాల వల్ల ప్రధాన అవయవాలు పాడవుతాయి. ఆహార కల్తీ చట్టంలో శిక్షలు చాలా తక్కువగా ఉండడం వల్ల కల్తీలను అరికట్టలేకపోతున్నామనే వాదన ఉంది. ఆహార కల్తీ చేసినవారిని కఠినంగా కనీసం ఐదేళ్లు జైలు శిక్ష పడేటట్టుగా, మరొక్కసారి వారు కల్తీలు చేయకుండా నిరోధించేట్టుగా శిక్షలు ఉంటేనే, కల్తీ ఆహార పదార్థాల బెడద తప్పే అవకాశం ఉంటుంది.
- ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి
