డిస్కంలను కేసీఆర్ నిండా ముంచిండు..రూ.45 వేల కోట్ల అప్పులు చేసిండు

డిస్కంలను కేసీఆర్ నిండా ముంచిండు..రూ.45 వేల కోట్ల అప్పులు చేసిండు

హైదరాబాద్, వెలుగు: కరెంట్ డిస్కంలను సీఎం కేసీఆర్ నిండా ముంచారని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. డిస్కంలకు ఆస్తుల కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని, వాటిపై రూ.45 వేల కోట్ల అప్పులు చేశారన్నారు. మంగళవారం పార్టీ స్టేట్‌‌ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. డిస్కంల ఆస్తులను బ్యాంక్‌‌లకు, ఫైనాన్షియల్ ఇన్‌‌స్టిట్యూషన్లకు తనఖా పెట్టి రుణాలు తెచ్చారని, ఈ విషయాన్ని కేంద్రం కూడా గుర్తించిందన్నారు.

విద్యుత్ రంగంలో తెలంగాణ సీ ప్లస్ ర్యాంక్‌‌కు దిగజారిందని చెప్పారు. ఈ ర్యాంక్‌‌తో రానున్న రోజుల్లో బ్యాంక్‌‌లు లోన్లు కూడా ఇవ్వవని తెలిపారు. డిస్కంలకు రూ.వేల కోట్ల బకాయిలు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సి ఉందని, ఒక్క ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ నుంచే రూ.9 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. ప్రగతి భవన్‌‌లోని కుక్కలకు కూడా ఏసీ రూమ్‌‌లు ఉన్నాయని, అక్కడ కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆర్టీఐ ద్వారా తెలుసుకోవాలన్నారు.

సింగరేణికి ట్రాన్స్ కో, జెన్ కో రూ.వేల కోట్ల బకాయిలు పడిందని గుర్తుచేశారు. అప్పులపై తాను ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు.. పాత ప్రభుత్వాలు ప్రారంభించినవేనని, కొత్తగూడెం, భద్రాచలంలో నిర్మాణంలో ఉన్నవి మాత్రమే బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిందని తెలిపారు. విద్యుత్‌‌ కొనుగోళ్లకు సంబంధించి చత్తీస్‌‌గఢ్‌‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.3 వేల కోట్లు బకాయి పడిందని, వీటిని చెల్లించకపోవడంతో అక్కడి ప్రభుత్వం మన రాష్ట్రంపై కేసులు కూడా పెట్టిందన్నారు. కరెంట్ బిల్లులకు సర్‌‌‌‌చార్జి, డెవలప్‌‌మెంట్ చార్జీల పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదన్నారు.